- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవర్ లోడు.. నెలకు కోటి రూపాయలు వసూలు
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు జిల్లా రవాణ శాఖకు కాసులు కురిపిస్తున్నాయి.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు జిల్లా రవాణ శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. గ్రానైట్, ఇసుక, కంకర, మట్టి తదితరాలను అధిక లోడ్ తో తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జిల్లాలో గ్రానైట్ రాయి తరలింపులో నిబంధనలు పాటించుకున్నా అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రానైట్ రాయి, ఇసుక తరలింపులో జిల్లాలోని అధికారులకు నెలకు కోటి రూపాయలకు పైగా మామూళ్ళు అందుతున్నాయి అన్నది విశ్వసనీయ సమాచారం.
ప్రమాదకరంగా గ్రానైట్ రాళ్లు తరలిస్తున్నా..
గ్రానైట్ రాళ్ళను అత్యంత ప్రమాదకరంగా ఎటువంటి భద్రత లేకుండా రద్దీ రోడ్లపై తరలిస్తున్నారు. గ్రానైట్ ఇసుక రవాణా నుండి నెలవారీ మామూళ్లు అందటంతో జిల్లాలోని రవాణా శాఖ మౌనంగా ఉంటున్నారు. భారీ పరిణామంలో ఉన్న గ్రానైట్ రాయి కింద పడితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గతంలో నగరంలోని శ్రీ శ్రీ సర్కిల్ వద్ద ఒక గ్రానైట్ రాయి వాహనంపై పడి పెద్ద ప్రమాదం జరిగింది. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ విస్తరించింది ఖమ్మం నగరం ముదిగొండ. ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలయపాలెం తదితర ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమ భారీగా విస్తరించింది గ్రానైట్ పరిశ్రమలకు ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలైన నల్గొండ, వరంగల్ నుంచి కూడా గ్రానైట్ రాయి భారీ ఎత్తున రవాణా అవుతున్నది. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఎటువంటి భద్రతా లేకుండా గ్రానైట్ రాయిని తరలిస్తున్నారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న ఈ వాహనాలను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేయడం గానీ, జరిమానా విధించడం కానీ చేయటం లేదంటే అందులో మతలబ్ అర్థం చేసుకోవచ్చు.
3500 కు పైగానే వాహనాలు...
జిల్లావ్యాప్తంగా ఇసుక కంకర మట్టి గ్రానైట్ రాళ్లు తరలించే వాహనాలు సుమారు 3వేల వరకు ఉంటాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్, కొత్తగూడెం, భద్రాచలం నుండి ఖమ్మం మీదుగా ఇతర ఇతర రాష్ట్రాలకు సరుకులు తీసుకెళ్లే వాహనాలు 500 కు పైగా ఉంటాయని అంచనా. అయితే చాలా వాహనాలు బిల్లులు లేకుండానే వెళ్తాయి. ఆయా వాహనాల నుండి జిల్లాలోని ఖమ్మంతో పాటు సత్తుపల్లి,వైరా రవాణా శాఖ అధికారులు మామూలు దండు కుంటున్నది బహిరంగ రహస్యమే. రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వాహనాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతమంది దళారీలు సైతం ఇందులో తమ వంతు సాయం చేస్తున్నారు. సొమ్ములు ఇవ్వని వాహనాలను తనిఖీ చేసి నానా ఇబ్బందులు పెడుతున్న రవాణా శాఖ అధికారులు, నెలవారీ మామూలు ఇచ్చే వాహన యజమానుల పట్ల ఊదారంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నెలకు రవాణా శాఖ అధికారులకు సుమారు కోటి రూపాయల వరకు మామూలు అందుతున్నట్లు తెలుస్తోంది.
కేసులు నమోదు చేస్తున్నాం: జిల్లా రవాణా ఇంచార్జ్ అధికారి జేఎన్. శ్రీనివాసరావు
ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా రవాణా శాఖ ఇన్చార్జ్ అధికారి జే.ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం స్కూలు బస్సుల ఫిట్నెస్ పై తనిఖీలు నిర్వహిస్తున్నామని దానిపై పూర్తి దృష్టి సారించినట్లు చెప్పారు. స్కూల్ బస్సులు తనిఖీలు పూర్తికాగానే పూర్తిస్థాయిలో ఓవర్ లోడ్ వాహనాలపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయడమే గాక భారీగా జరిమానాలు విధిస్తామని తెలిపారు.






