- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిలో కార్మికుల బతుకులకు భద్రత కరువు
సింగరేణి కార్మికుల భద్రత, సంక్షేమంపై దృష్టి సారించాలని వడ్డేపల్లి కుమారస్వామి పేర్కొన్నారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు కార్మికుల భద్రత, సంక్షేమంపై కూడా సమాన స్థాయిలో దృష్టి సారించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి పేర్కొన్నారు. కేటీకే-5 ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో శ్రీరాముల ప్రదీప్ అనే షార్ట్ ఫైర్ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాస్టింగ్ ప్రక్రియలో భాగంగా డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను వినియోగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో ఉన్న పేలుడు పదార్థాలు అకస్మాత్తుగా పేలిపోవడంతో కార్మికుడి వేళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితుల పై యాజమాన్యం సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేలుడు పదార్థాల నాణ్యత, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీయాలని ఆయన సూచించారు. కార్మికుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన రక్షణ చర్యలు అమలు చేయాలని అన్నారు. అలాగే గాయపడిన కార్మికుడికి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు, సంస్థ నిబంధనల ప్రకారం తగిన నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు.






