సాగు రంగాన్ని కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది: కేటీఆర్

by Kodari Anjali |

పాలేరు బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

సాగు రంగాన్ని కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది: కేటీఆర్
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మంలో ఉన్నది ముగ్గురు మంత్రులు కాదని, ముగ్గరు మోసగాళ్లుని, సీఎం రెవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శమని చెప్పి.. రాజదానిలో భవనాలు కూల్చివేయడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శమని విమర్శించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిదిలోని వెంకటగిరి క్రాస్ రోడ్ నందు గల హర్ష కన్వేషన్ హల్లో సర్(ఎస్ఐఆర్) పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రులు అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ ప్రతీకార ధోరణితో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వెలుగుమట్ల ఘటనను ప్రస్తావిస్తూ సీఎం రెవంత్ రెడ్డితో పాటు ముగ్గురు మంత్రులు పొంగులేటి, భట్టివిక్రమార్క, తుమ్మల లు కలిసి రాక్షసుల మాదిరిగా వ్యవహరించారని కేటీఆర్ విమర్శించారు. “వాళ్ల రియల్ ఎస్టేట్ దందా కోసం వెయ్యి ఇండ్లకు పైగా నేలమట్టం చేశారని దుయ్యబట్టారు. పేదలు రోడ్డున పడితే, ఆడబిడ్డలు గాయాలతో కుంటుతూ నడుస్తుంటే కూడా కనికరం చూపలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐక్యంగా ముందుకు సాగాలి..

ప్రజల బాధలను చూసి బాధపడాల్సింది పోయి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఇది ప్రజాస్వామ్య పాలన కాదని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నాయకుల అహంకారం పెరిగిపోయిందని, ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అలాగే పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి మరింత చురుకుగా పనిచేసి ప్రజల్లోకి వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ సూచించారు. 20లక్షల ఇండ్లు కట్టించిన తరువాతనే కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కమిషన్లకు తెరలేపారని విమర్శించారు. రెవెన్యూ మంత్రి పోంగులేటి అడ్డంగా వేల కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటరు జాబితా సవరణ (SIR) అత్యంత కీలకమని, ప్రతి బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అధికార దుర్వినియోగం చేసి బోగస్ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపుకు ప్రయత్నించే అవకాశం ఉందని కేటీఆర్ ఆరోపించారు.

అర్హులైన ఓటర్లను నమోదు చేయాలి...

ప్రతి ఓటు విలువైనదని, ఒక్క నిజమైన ఓటు కూడా తొలగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. గతంలో కొన్ని ఎన్నికల్లో బోగస్ ఓట్ల వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని గుర్తుచేసిన కేటీఆర్, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా బూత్ స్థాయి నుంచి పటిష్ట పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, కొత్త అర్హులైన ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. అలాగే డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్‌పై కూడా కేటీఆర్ దృష్టి పెట్టారు. “సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం” అని పేర్కొంటూ, క్రియాశీల కార్యకర్తలను గుర్తించి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. కొత్త మొబైల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

రాబోవు ఎన్నికల్లో పార్టీ శ్రేణులు..

రాబోయే రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తే పార్టీ మళ్లీ బలంగా ఎదుగుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలను పరిష్కరించడమే నా ధ్యేయం‌‌- మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ప్రజల సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అందరు అప్రమత్తంగా ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లింగాల కమల్ రాజ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, దిండిగాల రాజేందర్, మరికంటి ధనలక్ష్మి, పాలేరు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య పాల్గొన్నారు.

Next Story