- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోదీ పాలన.. ప్రగతికి సోపానం!
కాంగ్రెస్, భారాసలది మోసపూరిత పాలన అని భాజపా జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

దిశ, ఖమ్మం టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో గడిచిన పన్నెండేళ్లలో దేశం మున్నెన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని భాజపా జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మోదీ 12 ఏళ్ల సుపరిపాలన ఫోటో ఎగ్జిబిషన్‌ను బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తో కలిసి ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు కేటాయించిందని, అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్, గత భారాస ప్రభుత్వాలు ప్రజలను మాయమాటలతో మోసం చేశాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పన్నెండేళ్ల ప్రగతి ప్రస్థానం..
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 21వ తేదీ వరకు మోదీ 12 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేంద్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పాలన "విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం" అనే మూడు మూలస్తంభాలపై నిలబడి ఉందని స్పష్టం చేశారు. రైతులు, పేదలు, యువత, మహిళల సాధికారత కొరకు నాలుగు ప్రాధాన్యతా రంగాలుగా విభజించి పని చేస్తున్నామని చెప్పారు. మోదీ నాయకత్వంలో నేడు భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని, పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఉజ్వల యోజన ద్వారా 12 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు. కరోనా విపత్కర సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేసిన ఆత్మనిర్భర్ భారత్ మనదని గర్వంగా చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం దన్ను
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులను మంజూరు చేసిందని సుధాకర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 2013-14లో రూ.4.3 లక్షల కోట్లు ఉండగా, 2024-25 నాటికి అది రూ.11.1 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. 2014లో 2,135 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని నేడు 3,700 కిలోమీటర్లకు పైగా పెంచామని తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.47,984 కోట్ల పెట్టుబడులు పెడుతోందని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని, అందులో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, వరంగల్‌లో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు లాంటివి కేంద్రం సాధించిన విజయాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు రూ.11,300 కోట్లు, ఆదిలాబాద్‌కు రూ.56,000 కోట్లు, మహబూబ్ నగర్‌కు రూ.13,500 కోట్లు, వరంగల్‌కు రూ.6,100 కోట్లు ప్రత్యేక ప్యాకేజీల కింద కేటాయించామని వివరించారు. భద్రాచలం, రామప్ప లాంటి చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్, భారాసలపై ధ్వజం...
గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కుటుంబ పాలన, అవినీతి, అహంకారంతో తెలంగాణను భ్రష్టు పట్టించిందని పొంగులేటి విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. నేటికీ రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, ఖమ్మం కార్పొరేషన్‌లో కనీస డ్రైనేజీ వ్యవస్థ లేదని, త్రాగునీటి సదుపాయాలు సరిగ్గా లేవని స్థానిక సమస్యలను ఎత్తిచూపారు.
అభివృద్ధి ప్రదాత మోదీకి అండగా నిలవాలి..
"వికసిత్ భారత్ - వికసిత్ తెలంగాణ - వికసిత్ ఖమ్మం" అనే లక్ష్యంతో రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి, అభివృద్ధి ప్రదాత మోదీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉజ్వల గ్యాస్, గరీబ్ కళ్యాణ్ తదితర లబ్ధిదారులతో సుధాకర్ రెడ్డి నాయకులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోంగూర వెంకటేశ్వరరావు, ఆర్.ప్రదీప్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.రామలింగేశ్వరరావు, నాయకులు ఎం.నాగేందర్, శ్యామ్, ఎన్.రవి, సరస్వతి, అనిత, మణి, వీరభద్రం, లక్ష్మీ నారాయణ, రవి గౌడ్, జె.నరసింహారావు శ్రీకృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.






