కేటీఆర్ భయంతోనే రేవంత్ కు పాలమూరు గుర్తొచ్చింది

by Taduka Kalyani |

కేటీఆర్ పాదయాత్ర భయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన పాలమూరు ప్రాజెక్టులను సందర్శించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

కేటీఆర్ భయంతోనే రేవంత్ కు పాలమూరు గుర్తొచ్చింది
X

దిశ, షాద్ నగర్: కేటీఆర్ పాదయాత్ర భయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన పాలమూరు ప్రాజెక్టులను సందర్శించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. స్థానిక కుంట్ల రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో బుధవారం షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన డిజిటల్ సభ్యత్వ నమోదు, సర్(SIR) పై బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెడతానని ప్రకటన చేయడంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వణుకు ప్రారంభమైందని, ఆ భయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన పాలమూరు ప్రాజెక్టుల వద్దకు పరిగెత్తారని అన్నారు. ప్రాజెక్టుల సందర్శనతో పనులు పూర్తికావని, రైతులకు నీళ్లు రావని మండిపడ్డారు. కాలేశ్వరం, పాలమూరు లిఫ్ట్ తో బీడు భూములకు సాగునీరు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ పెట్టుబడి సాయం ఇచ్చి రైతును రాజును చేస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుబంధు నీరుగార్చి రైతులను హరిగోస పడుతోందని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వందల గురుకులాలు, మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయని, కేజీ టు కేజీ ఉచిత నాణ్యమైన విద్యను అందించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లక్షలాది విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు నిలిపివేసి పేద విద్యార్థుల చదువులకు గండి కొట్టారని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రికార్డు స్థాయి సభ్యత్వం నమోదు చేయాలి

షాద్ నగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు బూతు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి డిజిటల్ సభ్యత్వం చేయించాలని, సభ్యత్వం తీసుకునే వారి ఫోటోలను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి కార్యకర్త డిజిటల్ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో నమోదు చేసి షాద్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే కార్యకర్తలనే భవిష్యత్తులో నాయకులుగా గుర్తిస్తామని, కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

SIR పై అప్రమత్తంగా ఉండాలి

ఓటరు సమగ్ర సర్వేSIR ప్రక్రియపై బూత్ వస్తాయి కార్యకర్త తమ ప్రాంత బి ఎల్ ఎ తో రోజు సమన్వయం చేసుకుని బోగస్ ఓట్లను, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని, అసలైన ఓటర్లను జాబితాలో ఉండేలా చూడాలని, ఓటర్ సమగ్ర సర్వే విధానంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. షాద్ నగర్ ప్రజల గుండెల్లో నిలిచిన అభిమాన నాయకుడు అంజయ్య యాదవ్ ను మరో సారీ అసెంబ్లీకి పంపే వరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.

కేసీఆర్ పాలనలోనే సకలజనుల సుఖం : మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కేసీఆర్ చెప్పేవరకు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పేరు సైతం కాంగ్రెస్ పార్టీకి తెలుసా? 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు లిఫ్ట్ ను పూర్తి చేయకుండా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సకలజనులు, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి పాలమూరు ప్రజల కోసం ఐదు రిజర్వాయర్లతో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి 90% పనులు పూర్తి చేశామని, నాడు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు నేడు కడతామంటున్నారని, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే మంజూరు చేయాలని అంజయ్య యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, డిజిటల్ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ బైక్ని శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, రాజ వరప్రసాద్, నరేందర్, ఎమ్మెస్ నటరాజ్, రాజ్యలక్ష్మి, రాంబాల్ నాయక్, మెట్టునాయక్, లక్ష్మీ నరసింహ రెడ్డి, ఈట గణేష్, లక్ష్మణ్ నాయక్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story