నా సవాల్ స్వీకరించే దమ్ములేని నీ నుంచి ఇంకేం ఆశిస్తాం?.. కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-06-17 12:19:59  IST  )

బీఆర్ఎస్ పదేండ్లలో నిర్మించిన ఇండ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి పొంగులేటి కేటీఆర్‍కు మరోసారి చాలెంజ్ చేశారు.

నా సవాల్ స్వీకరించే దమ్ములేని నీ నుంచి ఇంకేం ఆశిస్తాం?.. కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ టిల్లు..చెప్తడు అబద్దాల సొల్లు.. అన్నట్టు సవాల్ స్వీకరించే దమ్ములేని డ్రామారావు నుంచి అబద్ధాలు తప్ప ఇంకేం ఆశిస్తాం? అని అన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో పాలేరులో పట్టపగలే అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నించారని దుయ్యబట్టారు. పదేండ్లు అధికారంలో ఉండి పేదలకు ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పలేని కేటీఆర్, రెండున్నరేండ్లలో లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. ఇవాళ పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తనపై చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి పొంగులేటి స్పందించారు.

అవినీతికి అంబాసిడర్లు మీరు:

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మీరే అవినీతికి అంబాసిడర్లని పొంగులేటి ధ్వజమెత్తారు. కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్, ఈ కార్ రేస్ స్కామ్, గొర్రెల పంపిణీ స్కామ్, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ధరణీ పేరుతో పేదల భూములు కొల్లగొట్టిన మీరా మాట్లాడేది?. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వాడుకున్నది మీరు. పదేండ్లలో ఒక్క గిరిజన తండాలోనైనా ఒక్క ఇళ్లైన కట్టి ఇచ్చారా అని ప్రశ్నించారు. మేము కేవలం ఈ 2 ఏండ్లలో గిరిజన ప్రాంతాలున్న నియోజకవర్గాలకు మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో పాటు అదనంగా 1500 కేటాయించి గిరిజన గూడాల్లోని గుడిసెలను, పక్కా ఇండ్లుగా మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు.

నా సవాల్ మళ్లీ గుర్తు చేస్తున్నా:

ఇందిరమ్మ ఇండ్లపై నా సవాల్‌ను మరోసారి గుర్తుచేస్తున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో కూడా, బీఆర్ఎస్ పదేండ్లలో నిర్మించిన ఇండ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉంటానని కేటీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పదేండ్లలో నిర్మించిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే ఎక్కువ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందని హైదరాబాద్‌లో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామన్నారు. ఎక్కువ ఇండ్లు నిర్మించి ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఈ విషయం కేటీఆర్‍కు కూడా తెలుసు కాబట్టే సవాల్‍ను స్వీకరించేందుకు ముందుకు రావడం లేదన్నారు.

Next Story