సీఎం రేవంత్‌ క్వాష్ పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-17 13:30:57  IST  )

తనపై నమోదైన ఐదు కేసులను కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణ ముగిసింది.

సీఎం రేవంత్‌ క్వాష్ పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు (Telangan High Court)లో సుదీర్ఘ విచారణ ముగిసింది. గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ ఈ కేసులపై తన తుది తీర్పును రిజర్వ్ (Reserved) చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో అప్పటి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే, ఆ ప్రచార పర్వంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల నిబంధనలను (Model Code of Conduct) ఉల్లంఘించారంటూ సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా మొత్తం 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పుర్మీషన్లు లేకుండా ర్యాలీలు నిర్వహించడం, రోడ్‌షోల ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి ఆరోపణలను పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

కేసులు కొట్టేయాలని రేవంత్ క్వాష్ పిటిషన్..

తనపై నమోదైన 5 కేసులను కొట్టేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్లు (Quash Petitions) దాఖలు చేశారు. విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కేసులన్నీ పొలిటికల్ ప్రెజర్‌తో పెట్టినవని, ఎలక్షన్ కోడ్‌ కింద నేర నిరూపణకు సరైన ఆధారాలు లేవని కోర్టుకు వివరించారు. మరోవైపు ఎన్నికల సంఘం తరఫున లాయర్లు నిబంధనల ఉల్లంఘన జరిగిన మాట వాస్తవమేనని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం రేవంత్ క్వాష్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతోందని అటు ప్రతిపక్షాల్లో.. ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story