- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన మహోత్సవానికి సన్నద్దం..పాల్గొననున్న సీఎం రేవంత్
వన మహోత్సవానికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : వన మహోత్సవానికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. వర్షకాలం ప్రారంభమవ్వడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్కాజిగిరి నగర పాలక సంస్థ(ఎంఎంసీ) వన మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎంఎంసీ పరిధిలోని ఆయా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 18న వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఎం ఎం సి పరిధిలోని గుర్రం గూడ లో అధికారికంగా ప్రారంభించనున్నారు.ఆ మరుసటి రోజున 19 వ తేదీన ఎంఎంసి పరిధిలో వన మహోత్సవాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.అయితే,ప్రతీ ఏడాది పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి తర్వాత వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో చాలా వరకు ఎండిపోతున్నాయి. దీనికితోడు మొక్కలు కూడా వృదా అవుతున్నాయి. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
టార్గెట్ 8.2 లక్షల మొక్కలు..
ఎంఎంసీ పరిధిలో పట్టణీకరణ పెరిగిన కాలుష్య స్థాయిల దృష్ట్యా వన మహోత్సవానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.అయితే ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న క్షేత్రస్థాయిలో మొక్కలు కనిపించడంలేదు.ఇలాంటి పరిస్థితిల్లో మరోసారి మొక్కలు నాటేందుకు సన్నద్దమవుతున్నారు. ఎంఎంసీ లో మూడు జోన్లు,14 సర్కిళ్లు ఉన్నాయి.మల్కాజిగిరి ,ఉప్పల్ రెండు జోన్ల పరిధిలో ఒక్కో జోన్ లో 2.85 లక్షల చొప్పున ఎల్ .బి.నగర్ జోన్ 2.50 లక్షలు మొత్తం 8.2 లక్షల మొక్కలు నాటనున్నారు.వీటిలో 7.50 లక్షలు రోడ్డుకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో ,పాఠశాల అవరణల్లో ,కుల సంఘాల భవనాల సముదాయాల్లో నాటనుండగా, మరో 70 వేల మొక్కలను గృహ యాజమానులకు అందజేయనున్నారు. ఇందుకోసం ఎంఎంసీ పరిధిలోని 19 పాత నర్సరీలలో 2లక్షల 87 వేల 425 మొక్కలను పెంచుతుండగా, కొత్తగా ఏర్పాటు చేసిన మరో 8 నర్సరీలలో ఒక లక్షా 98 వేల 412 మొక్కలను పెంచుతున్నారు. మిగిలిన 1.49 లక్షల మొక్కలను హెచ్ఎండీఏ,అటవి శాఖల నుంచి సమకూర్చుకోనున్నారు.దానిమ్మ, జామ, మునగ,అల్లనేరేడు, బొప్పాయి,బాదం,ఊసిరి, ఈత, మందారం, గులాబీ,జాస్మీన్, వేప ,కానుగ,మునుగ,మామిడి, కరివేపాకు తదితర రకాల మొక్కలు నాటేందుకు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి.
పచ్చదనం పెంపునకు కృషి - సునందారెడ్డి
ఎంఎంసీ లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పంపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. వన మహోత్సవంలో భాగంగా గృహ యాజమానులకు 70 వేల మొక్కలు ఇచ్చి నాటాలని ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రజలు అడిగిన మొక్కలు అందజేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. వన మహోత్సవం కోసం ఇప్పటికే నర్సరీల్లో 6.71 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచాం.మరో 1.49 లక్షల మొక్కలను హెచ్ఎండీఏ, అటవీ ప్రాంతాల నుంచి సేకరించనున్నామని తెలిపారు యూబీడీ, డైరెక్టర్ ఎంఎంసీ డాక్టర్ సునందారెడ్డి.






