- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెట్టిచాకిరీ చేసే కార్మికులు వస్తువులపై భారత్ నిషేధం..! కేంద్రం కీలక నిర్ణయం
వెట్టిచాకిరీ (Forced Labour) ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వెట్టిచాకిరీ (Forced Labour) ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తమ విదేశీ వాణిజ్య విధానాన్ని (Foreign Trade Policy) సవరించింది. అమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం చేసుకోవడంలో భాగంగానే కేంద్రం ఈ అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. దీనిపై అధికారిక గెజిట్ వెలువడిన 30 రోజుల్లోపు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది.
అమెరికా ఒత్తిడి..
జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. వెట్టిచాకిరీతో తయారైన వస్తువుల దిగుమతులను అరికట్టడంలో విఫలమయ్యాయంటూ భారత్ సహా 54 దేశాలపై 12.5 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించాలని అమెరికా డ్రాఫ్ట్ ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఒప్పందం కుదుర్చుకునే దిశగా తాజా నిషేధాన్ని ప్రకటించింది. నిషేధిత వస్తువుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల వాడకంపై ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్-2023’ నిబంధనల ప్రకారం డీజీఎఫ్‌టీ విచారణ జరుపుతుంది.
వెట్టిచాకిరీ నిర్వచనం..
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) కన్వెన్షన్-1930 ప్రకారం.. ఒక వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా, ఏదైనా శిక్ష విధిస్తామని భయపెట్టి బలవంతంగా చేయించుకునే పనిని లేదా సేవను ‘వెట్టిచాకిరీ’గా పరిగణిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య విధానాన్ని సవరించడం శుభపరిణామం అని గ్రాంట్ థార్న్‌టన్ భరత్ ప్రతినిధి మనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వ విచారణా యంత్రాంగం, అమలు తీరుపైనే ఈ చట్టం విజయం ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.






