హర్మూజ్‌ను తెరిచేందుకు ప్రయత్నాలు.. 35కిపైగా దేశాల జాబితాలో భారత్‌

by Ramesh Naini |

హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, సముద్ర భద్రత కోసం బ్రిటన్ సారథ్యంలో జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సుకు భారత్ హాజరు కానుంది.

హర్మూజ్‌ను తెరిచేందుకు ప్రయత్నాలు.. 35కిపైగా దేశాల జాబితాలో భారత్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పునరుద్ధరణ, సముద్ర భద్రత కోసం బ్రిటన్ సారథ్యంలో జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సుకు భారత్ హాజరు కానుంది. దాదాపు 35 దేశాలు పాల్గొంటున్న ఈ సమావేశానికి భారత్‌కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ధృవీకరించింది. భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ సదస్సులో పాల్గొంటారని ఎంఈఏ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ వెల్లడించారు.

సదస్సు ముఖ్య ఉద్దేశాలు..

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఈ వారం చివర్లో 35 దేశాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గల్ఫ్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానాన్ని పునరుద్ధరించడం, జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు, నావికుల భద్రతకు హామీ ఇవ్వడం ప్రధాన లక్ష్యం. అలాగే ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ వంటి అత్యవసర సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించేందుకు గల దౌత్య, రాజకీయ మార్గాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.

భారత్ ముందస్తు చర్యలు.. ఆరు నౌకలు సేఫ్

నౌకల సురక్షిత ప్రయాణానికి సంబంధించి భారత్ ఇప్పటికే ఇరాన్ సహా ఇతర సంబంధిత దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని రణ్‌ధీర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ తదితర ఉత్పత్తులతో వెళ్తున్న ఆరు భారతీయ వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటగలిగాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులోనూ తమ నౌకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు అన్ని పక్షాలతో టచ్‌లో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Next Story