థమ్స్ అప్ ఎమోజీ పెట్టాడు.. రూ.74 లక్షల జరిమానా కట్టాడు

by Dishafeatures2 |
థమ్స్ అప్ ఎమోజీ పెట్టాడు.. రూ.74 లక్షల జరిమానా కట్టాడు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక కమ్యూనికేషన్ లో మార్పు వచ్చింది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ లాంటివి వచ్చాక కమ్యూనికేషన్ మరింత ఈజీ అయ్యింది. సోషల్ మీడియా యాప్ లలో టెక్స్ట్ మెసేజ్ లతో పాటు ఎమోజీలు కూడా చాలా ఉపయోగిస్తారు. చాలా పదాల్లో చెప్పాల్సిన అర్థాన్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎమోజీలని బాగా వాడుతారు. అయితే ఎమోజీల అర్థం సరిగ్గా తెలియకపోయినా.. లేక వాటిని ఇష్టమొచ్చినట్లుగా వాడినా ప్రమాదంలో పడ్డట్లేనని కెనడాలో ఓ కోర్టు ఇచ్చిన తీర్పును చూస్తే అర్థమవుతుంది. ఓ కాంట్రాక్టు విషయంలో థమ్సప్ ఎమోజీని పెట్టిన కారణంగా ఓ వ్యక్తికి కెనడా కోర్టు రూ.74 లక్షల జరిమానా విధించింది.

ఇంతకూ ఏం జరిగిదంటే.. కెనాడాలోని ఓ ధాన్యం వ్యాపారి అక్కడి ఓ రైతుతో ఫ్లాక్స్ ధాన్యం కొనేందుకు సోషల్ మీడియాలో సందేశం పంపాడు. ఈ నేపథ్యంలోనే దాదాపు 87 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి వారిద్దరూ చాట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు అమ్మితే ఫలానా రేటు ఇస్తానంటూ వ్యాపారి అతడికి ఆఫర్ ఇచ్చాడు. అయితే దీనికి ఆ రైతు థమ్స అప్ ఎమోజీ పెట్టాడు. కానీ చివరికి ఆ రైతుకు వేరే వ్యాపారి నుంచి మంచి ఆఫర్ రావడంతో మొదటి వ్యాపారికి ధాన్యం అమ్మడానికి నిరాకరించాడు. దీంతో వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్ల నుంచి నడుస్తోన్న ఈ కేసు తుది తీర్పును తాజాగా కోర్టు వెలువరించింది. థమ్స్ అప్ ఎమోజీని పెట్టడం ద్వారా సదరు రైతు కాంట్రాక్టుకు ఓకే చెప్పినట్లేనని సంచలన తీర్పునిచ్చింది. అయితే తాను ఎమోజీ పెట్టింది ఆఫర్ గురించి తప్ప కాంట్రాక్టుకు ఒప్పుకున్నట్లు కాదని రైతు తరఫు న్యాయవాది తెలిపాడు.

కానీ కోర్టు ఆయన వాదనతో ఏకీభవించలేదు. ఇక ధాన్యం వ్యాపారి కూడా తమ కాంట్రాక్టుపై స్పందించాలని తమ ప్రతినిధి రైతుకు మెసేజ్ పెట్టారని, ఈ క్రమంలోనే రైతు థమ్స్ అప్ ఎమోజీ పెట్టారని కోర్టుకు తెలిపారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ధాన్యం వ్యాపారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పలు డిక్షనరీల్లో థమ్స్ అప్ ఎమీజీకి ఉన్న అర్థాన్ని, ప్రజలు ఏ ఏ సందర్భాల్లో ఈ ఎమోజీని వాడుతున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని తుది తీర్పును వెలువరించినట్లు జడ్జి టీజే కీన్ తెలిపారు. ధాన్యం అమ్మకపోవడంతో వ్యాపారి నష్టపోయారని, అతడికి $82,200.21 (భారత కరెన్సీలో రూ.74 లక్షలు) చెల్లించాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రజలు టెక్నాలజీని బాగా వాడుతున్నారన్న కోర్టు.. మారుతున్న కాలాన్ని బట్టి కోర్టులు కూడా టెక్నాలజీ, అక్కడ వాడే భాష పట్ల అవగాహనను పెంచుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.


Next Story

Most Viewed