నౌకను తాకితే.. వంతెనలు, విద్యుత్ కేంద్రాలు బూడిదే..! ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

by Ramesh Naini |

హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

నౌకను తాకితే.. వంతెనలు, విద్యుత్ కేంద్రాలు బూడిదే..! ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు లేదా మరే ఇతర ఆయుధంతో నౌకలపై దాడి చేసినా.. దానికి ప్రతీకారంగా ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని పేల్చేస్తామని ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరించారు. అవసరమైతే రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామన్నారు.

వీరులకు నివాళి..

ఇరాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అమెరికా సైనికుల భౌతికకాయాలకు నివాళులు అర్పించిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 18 మంది అమెరికా సైనికులు మరణించగా, అణ్వాయుధాలను ఇరాన్ చేతికి చిక్కనివ్వబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు.

ముదిరిన ఉద్రిక్తతలు

కాగా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు, పొరుగు గల్ఫ్ దేశాలలోని తాగునీటి (డీశాలినేషన్), విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. జోర్డాన్ సైన్యం కూడా ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది.

ఎవరి వాదన వారిదే..

ఈ యుద్ధంతో ట్రంప్ ఊబిలో కూరుకుపోయారని ఇరాన్ విమర్శిస్తుండగా, పౌర ప్రాణనష్టం భారీగా (53 మంది మృతి) ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే, పౌరులను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోమని అమెరికా స్పష్టం చేసింది. చర్చల పట్ల ఇరాన్‌కు చిత్తశుద్ధి లేదని, తమ దేశంతో పాటు మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చిచెప్పారు.

Next Story