"8 యుద్ధాలను ఆపాను.. భారత్-పాక్ మధ్య అణు యుద్ధాన్ని తప్పించాను": డొనాల్డ్ ట్రంప్

by Malleboina Mahesh |

ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పలు యుద్ధాలను ముగించడంలో తాను కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

8 యుద్ధాలను ఆపాను.. భారత్-పాక్ మధ్య అణు యుద్ధాన్ని తప్పించాను: డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పలు యుద్ధాలను ముగించడంలో తాను కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఇప్పటివరకు తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ప్రస్తుతం తన దృష్టి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అణు యుద్ధం రాకుండా తాను అడ్డుకున్నానని, ఆ సమయంలో పాకిస్థాన్ ప్రధాని తనతో మాట్లాడుతూ "ట్రంప్ పది మిలియన్ల (కోటి) మంది ప్రాణాలను కాపాడారు" అని భావోద్వేగానికి గురయ్యారని గుర్తు చేసుకున్నారు.

ఆ సమయంలో ఎనిమిది విమానాలు కూల్చివేయబడ్డాయని, యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోందని, కానీ తన జోక్యంతో ఆ ముప్పు తప్పిందని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అలాగే థాయ్‌లాండ్, కాంబోడియా సరిహద్దు వివాదాలను కూడా తాను చక్కదిద్దానని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య తీవ్రమైన విద్వేషం ఉందని, అయితే ఆ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం టారిఫ్‌లు (సుంకాలు), దౌత్యపరమైన ఒత్తిడి ద్వారానే తాను ఈ శాంతిని తీసుకురాగలిగానని ఆయన పునరుద్ఘాటించారు.

Next Story