‘డబుల్’​ పరేషాన్..!

by Jakkula.Mamatha |

హనుమకొండ నగరం నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

‘డబుల్’​ పరేషాన్..!
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: హనుమకొండ నగరం నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన లబ్ధిదారులకు అందించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులను గుర్తించి వారికి ఇండ్లను కేటాయించారు. ఇండ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచిన తర్వాత లబ్ధిదారులకు కేటాయించడంతో అప్పటికే ఇండ్ల కిటికీలు, తలుపులు, విద్యుత్ బోర్డులు, వాటర్ నల్లాలు చోరీకి గురయ్యాయి. లబ్ధిదారులు నివాసం ఉండేందుకు లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేయించుకోవాల్సి వచ్చింది.

దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ..

డబుల్ బెడ్రూం ఇండ్లలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో డ్రైనేజీ నీరు రోడ్ల పై ప్రవహిస్తూ దుర్వాసనను వెదజల్లుతుంది. నిర్మించిన ఏళ్ల తర్వాత కేటాయించడం డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీనికితోడు ఇండ్ల పరిసరాల్లోనే చెత్తాచెదారం పేరుకుపోయింది. అక్కడే నివసిస్తున్న లబ్ధిదారుల కుటుంబ సభ్యులు నిత్యం అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుకు రాని 40 శాతం మంది లబ్ధిదారులు..

డబుల్ బెడ్రూం ఇండ్లలో 37 బ్లాక్లు ఉండగా ప్రతీ బ్లాకుకు 16 కుటుంబాల చొప్పున మొత్తం 592 కుటుంబాలకు ప్రభుత్వం ఇండ్లను కేటాయించింది. కానీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడం, ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని శుభ్రపరచకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టకపోవడం, నిత్యం దుర్వాసన వెదజల్లుతుండడంతో లబ్ధిదారులు ఆ ఇండ్లలో నివసించేందుకు జంకుతున్నారు. 592 మంది లబ్ధిదారుల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే ఆ ఇండ్లలో నివసిస్తున్నారు. మిగతా 40 శాతం మంది వివిధ కారణాలతో ఆ ఇండ్లలో నివసించేందుకు భయపడుతున్నారు.

ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలి..

డబుల్ బెడ్రూం ఇండ్లలో అనేక సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్లపైకి వస్తుంది. సెంట్రల్ లైటింగ్ లేక రాత్రివేళ వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇప్పటికీ దొంగతనాలు కొనసాగుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలి. మున్సిపాలిటీ సిబ్బంది ప్రతీరోజూ చెత్త సేకరించేలా నాయకులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. - ఎర్ర చంద్రమౌళి.. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్

Next Story