- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూభారతి పోర్టల్‌లో చిత్రవిచిత్రాలు
ధరణికి వినియోగించిన సాఫ్ట్ ద్వారానే ఈ పోర్టల్ నడుస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం.. భూ భారతిలో చిత్ర విచిత్రాలు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ లావాదేవీలు, రికార్డుల నిర్వహణ మొత్తం భూ భారతి వెబ్ పోర్టల్ ద్వారానే జరుగుతుంది. ధరణికి వినియోగించిన సాఫ్ట్ ద్వారానే ఈ పోర్టల్ నడుస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొత్తది రూపొందించకుండా.. అస్తవ్యస్తమైన సాఫ్ట్ వేర్ ద్వారానే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ను నడిపిస్తుండడంతో అనేక అక్రమాలకు ఆస్కారమేర్పడుతున్నది. మూడు, నాలుగు నెలల క్రితమే స్టాంప్ డ్యూటీ స్కాం బయటపడింది. అయితే ఆ కుంభకోణం చాలా చిన్నదని, ఆపరేటర్లు, మీ సేవా నిర్వాహకుల పొరపాటు, అతి తెలివితేటల వల్లే జరిగిందని చెప్పిన ప్రభుత్వం.. దానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోలేదు.
అయితే ఈ సాఫ్ట్ వేర్ చేస్తున్న చిత్రవిచిత్రాలు అనేకం బయటపడుతున్నాయి. బ్యాంకులో మార్ట్ గేజ్ చేసిన ప్రాపర్టీని కూడా అమ్మకాలు, కొనుగోలు చేయొచ్చని తేలింది. స్లాట్ బుక్ చేసుకొని జాయింట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే సంతకాలు పెట్టించుకొని కొత్త పట్టాదారు పాసు పుస్తకం చేతిలో పెట్టేస్తారు. స్టాంప్ డ్యూటీ ఎగవేతనే కాదు.. బ్యాంకుల్లో తనఖా పెట్టిన ప్రాపర్టీస్ ని కూడా అమ్మేసేందుకు భూ భారతి సాఫ్ట్ వేర్ మార్గం సుగమం చేస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి సాఫ్ట్ వేర్ ను కొనసాగుతుండడం అంటే అక్రమాలకు బాటలు వేయడమేనన్న విమర్శలు వస్తున్నాయి.
స్లాట్ బుకింగ్.. రిజిస్ట్రేషన్ కంప్లీట్
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరులో ఒక ల్యాండ్ సేల్ డీడ్ జరిగింది. ఆ ల్యాండ్ అప్పటికే కెనరా బ్యాంకులో తనఖా పెట్టారు. కానీ అమ్మకానికి స్లాట్ బుక్ అయ్యింది. మొదట వివరాలు ఎంటర్ చేస్తున్నప్పుడు బ్యాంకు లోన్ విషయం డిస్ ప్లే అయ్యింది. అయినా మీరు ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా? అని వచ్చింది. ఎస్ అనగానే మిగతా వివరాలను అడిగింది. స్లాట్ బుక్ అయ్యింది. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. అయితే 2021 లోనే తనఖా పెట్టినట్లుగా ఈసీలో చూపిస్తుంది. కానీ పట్టాదారు పాస్ బుక్, కొనుగోలుదారుడు, అమ్మకందారుల వివరాలు, ఒరిజినల్ ఈ స్టాంప్ ఈ చలాన్, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, సాక్ష్యుల వివరాలు అప్ లోడ్ చేయగానే స్లాట్ బుక్ అయ్యింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఎలాగూ స్లాట్ బుక్ కావడంతో సేల్ డీడ్ చేయకుండా నియంత్రించేందుకు తహశీల్దార్ కు అధికారాలు కూడా లేవు. ఇలాంటివి ఇంకెన్ని జరిగాయి అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంట రుణాలు మాత్రమే తీసుకునే రైతుల సంఖ్య అధికం. ల్యాండ్ ను తనఖా పెట్టుకుని గ్రామీణ బ్యాంకు లేవీ రుణాలు ఇవ్వవు. కానీ అర్బన్, సెమీ అర్బన్ ఏరియాలో మాత్రం రూ.కోట్లల్లో రుణాలు ఇస్తున్నాయి. ఆఖరికి చెరువును తనఖా పెట్టుకుని రూ.కోట్లు రుణాలు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ల్యాండ్ ను పరిశీలించకుండానే లోన్ మంజూరు చేసిన బ్యాంకు అధికారులు ఉన్నారు. అయితే ఇప్పుడా మార్ట్ గేజ్ లో పెట్టిన ల్యాండ్స్ అలాగే ఉన్నాయా? ఎవరికైనా అమ్మేశారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. భూ భారతి సాఫ్ట్ వేర్ మహిమ వల్ల ఇతరులకు అమ్మేందుకు అవకాశం లభించింది.
సాఫ్ట్ వేర్‌లో లోపాలు
రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ స్కాంలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? అసలు దోషులెవరు? రాష్ట్ర ఖజానాకు ఎంత గండి కొట్టారు? భూ భారతి, ధరణి పోర్టల్ కి ఎట్లా కన్నం పెట్టారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఒక్కో మండలంలో ఈ చలానాకు, అసలైన స్టాంప్ డ్యూటీ కి మధ్య ఎంత తేడా ఉందో లెక్క కట్టింది. ఆయా తహశీల్దార్లకు జాబితాలను పూర్తి వివరాలతో పంపారు. ఈ లెక్కలు తేల్చాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. రూ.14,000 ఉంటే ఒక సున్న ఎగిరేసి రూ.1400 వరకు కట్టేసి.. ఆ తర్వాత ఎడిట్ చేసిన ఈ చలాన్ పీడీఎఫ్ ని జత చేశారు. సేల్ డీడ్ లోనే అంకెల గారడీ కనిపించింది. ఒక్కటే సేల్ డీడ్ లో ట్రాన్సాక్షన్ సమ్మరీ, ఈ చలాన్ లో ఒకే విధంగా ఉండాల్సిన పద్దులు వేర్వేరుగా దర్శనమిచ్చాయి.
కొన్ని చోట్ల ట్రాన్స్ ఫర్ డ్యూటీ జీరోగా లేదా ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని సేల్ డీడ్స్ లో మైనస్ అమౌంట్ ని కూడా చూపించాయి. అందుకే ఈ స్టాంప్ డ్యూటీ స్కాంలో ఉద్దేశ్యపూర్వకంగా దోచుకున్న దొంగలతోపాటు టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా దర్యాప్తు చేసి గండి కొట్టిన అమౌంట్ ను వసూలు చేయాలని పంపిన లిస్టులను పట్టుకొని తహశీల్దార్లు విచారణ చేసి నివేదికలు సమర్పించారు. అయితే ఆ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో బయటికి రాలేదు. అలాగే వారికి సహకరించిన తహశీల్దార్లు, ఆర్డీవోలపైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అంతా ఔట్ సోర్సింగ్, మీ సేవా నిర్వాహకులపై తప్పులు వేసి చేతులు దులిపేసుకున్నారు.
తప్పులు చోటు చేసుకున్నా..
ధరణి పోర్టల్ రూపకల్పనకు ఉపయోగించిన సాఫ్ట్ వేర్ తప్పులతడక అని పలుమార్లు రుజువైంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు ప్రకటించారు. అయినా అలాంటి అస్తవ్యస్త సాఫ్ట్ వేర్ ను కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. తప్పని, పనికి రానిదని గుర్తించినప్పుడు ఎందుకు మార్చడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్ లో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే సొమ్ము రిటర్న్ వచ్చే సిస్టం లేదు. ఇప్పటికీ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలాంటి తప్పిదాల సాఫ్ట్ వేర్ ని మార్చడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నరని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.






