ఆరు నెలలుగా తెగని పంచాయితీ!

by Jakkula.Mamatha |

కొత్త సర్పంచులు వచ్చి ఆరు నెలలకు పైగా కాలం గడిచిపోయిన కిషనరావు పేట గ్రామ పంచాయతీలో పాలకవర్గం మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల సమస్య అంతకంతకు పీఠముడిలా మారగా ఏకంగా పంచాయతీ పాత సెక్రటరీ కృష్ణా రెడ్డి జీపి రికార్డులు మాయం చేసి సర్పంచుకు పాలకవర్గానికి సవాల్ విసరడం సంచలనంగా మారింది.

ఆరు నెలలుగా తెగని పంచాయితీ!
X

దిశ, వెల్గటూర్: కొత్త సర్పంచులు వచ్చి ఆరు నెలలకు పైగా కాలం గడిచిపోయిన కిషనరావు పేట గ్రామ పంచాయతీలో పాలకవర్గం మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల సమస్య అంతకంతకు పీఠముడిలా మారగా ఏకంగా పంచాయతీ పాత సెక్రటరీ కృష్ణా రెడ్డి జీపి రికార్డులు మాయం చేసి సర్పంచుకు పాలకవర్గానికి సవాల్ విసరడం సంచలనంగా మారింది. సర్పంచ్ పని చేసిన బిల్లులు ఇప్పించాలని పాత సెక్రటరీ కృష్ణారెడ్డి డిమాండ్ చేస్తుండగా సరైన బిల్లులు తెస్తేనే ఇస్తామని పాలక వర్గం తిరస్కరిస్తుంది. దీంతో సెక్రటరీ జీపీ రికార్డులు మాయం చేయగా, గ్రామంలో ఆరు నెలలుగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో మర్మం ఏమిటో తెలియడం లేదు. ఇందులో వారి పాత్ర ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కిషన్​రావుపేట గ్రామ పంచాయతీలో కొత్త సర్పంచ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కాలం నుంచి సర్పంచ్, పాలకవర్గం, కార్యదర్శి మధ్య ఆర్థిక లావాదేవీలపై హై డ్రామా కొనసాగుతూనే ఉంది. గడిచిన రెండేళ్ల అధికారుల పాలనలో గ్రామ కార్యదర్శి కృష్ణారెడ్డి రూ.8 లక్షలు వెచ్చించి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారికి విన్నవించుకున్నాడు. సరైన బిల్లులు సమర్పించండి, దానికి సంబంధించిన డబ్బులు ఇస్తామని పంచాయతీ పాలకవర్గం చెబుతూ వస్తున్నారు. కార్యదర్శి అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించకుండానే రూ.8 లక్షల బకాయిలను బిల్లులు లేకుండా అనామతుగా చెల్లించాలని పాలకవర్గం పై ఒత్తిడి పెంచాడు. పైగా రికార్డులను తన వద్దనే ఉంచుకొని గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటూ ఆటలాడుతున్నారు.

రికార్డులు మాయం చేసిన పాత సెక్రెటరీ

గ్రామంలో సుదీర్ఘ కాలం పని చేసిన కార్యదర్శి కొత్త పాలక వర్గంతో కూడా కొద్ది నెలలు పని చేశాడు. పంచాయతీ కార్యదర్శి మధ్య ఏర్పడిన గ్యాప్ వల్ల ఇరువర్గాలు ఎడ మొహం పెడ మొహం గానే ఉన్నాయి. ఈ విషయాన్ని పాలక వర్గం మండల పరిషత్ ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లిన వారు మీరే పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చి పంపటంతో సమస్య మరింత జటిలమయ్యింది. కాగా కార్యదర్శి జీపీ రికార్డులనే మాయం చేశాడు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో పాత కార్యదర్శి కృష్ణారెడ్డి బదిలీ పై వెళ్లుతూ ఏకంగా జీపీ రికార్డులను సైతం వెంట తీసుకెళ్లాడు. అప్పటి నుంచి జీపీలో ఎలాంటి రికార్డు లేకుండా కొత్తగా వచ్చిన కార్యదర్శి తో పాటు పాలకవర్గం చేతులు పిసుక్కొంటోంది. తద్వారా గ్రామం అభివృద్ధి పూర్తిగా కుంటు పడుతుంది. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకొని రికార్డులు తెప్పించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలి:కుమ్మరి సునీత సర్పంచ్ కిషనరావు పేట్

గ్రామ పంచాయతీలో అధికారుల పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగం పై అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. కార్యదర్శి చేపట్టిన పనులకు బిల్లులు రావాలని బదిలీ పై వెళ్తూ జీపీ రికార్డులను మాయం చేయటం పట్ల అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలి.

రిజిస్టర్లు, తీర్మానాలు బిల్లులు లేవు ..

అధికారుల పాలనలో కార్యదర్శి చేసిన పనులకు ఎలాంటి రిజిస్టర్లు తీర్మానాలు బిల్లులు లేవు. రూ.8 లక్షల రూపాయలు జీపీ నిధుల నుంచి ఎలా ఇవ్వాలి. ఇవే బిల్లులంటూ చిట్టీలు సమర్పించి ఎనిమిది లక్షల బకాయిలు ఇవ్వాలని పాలకవర్గం పై కార్యదర్శి ఒత్తిడి తెస్తున్నారు. సరైన బిల్లులు సమర్పిస్తేనే బకాయిలు చెల్లిస్తాం. జీపీ రికార్డులు మాయం చేసిన కార్యదర్శి పై కఠిన చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధికి అధికారులు సహకారం అందించాలి.

Next Story