ప్రాణాలు తీస్తున్న ఇసుక మాఫియా.. గ్రామస్తుల ఆందోళన

by Jakkula.Mamatha |

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది.

ప్రాణాలు తీస్తున్న ఇసుక మాఫియా.. గ్రామస్తుల ఆందోళన
X

దిశ ,ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటున్న శ్రీరాముల కర్ణాకర్ కూతురు మూడేళ్ల చిన్నారి శ్రీరాముల శ్రీ హన్సికను అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. స్థానికుల కథనం ప్రకారం .. కొలను పాక గ్రామంలో అక్రమంగా అడ్డగోలుగా ఇసుక రవాణా ఆటో ట్రాలీలా ద్వారా కొలనుపాక వాగునుంచి ప్రతి రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా దర్జాగా కొనసాగుతుంది. మంగళవారం ట్రాలీ ఆటో ద్వారా ఇసుక రవాణా చేస్తున్న ఆటో ట్రాలీ అత్యంత వేగంగా చిన్నారి పైకి దూసుకు వచ్చింది. దీంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు.

గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం..

గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్న స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎన్ని ప్రాణాలు పోతే అక్రమ రవాణా ఆగుతుంది?" అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఆలేరు మండలంలో కొంతకాలంగా అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై నిరంతర నిఘా, కఠిన చర్యలు ఉంటే ఇలాంటి విషాదాలు నివారించవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

అక్రమ ఇసుక మాఫియాకు రాజకీయ అండ..

ఆలేరు మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా మాఫియాకు రాజకీయ పలుకుబడి గల అధికార పార్టీ నాయకుల అండదండల కారణంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అధికార రాజకీయ పార్టీ నాయకుల జోక్యం కారణంగా రెవెన్యూ పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతూ తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒక అధికార పార్టీ నాయకుడు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్రమ ఇసుక ట్రాలీలను పట్టుకున్న పోలీసులను బెదిరింపులకు గురి చేయడమే అక్రమ ఇసుక రవాణా మాఫియా అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతున్నారడానికి నిదర్శనం.

ఇసుక మాఫియాపై డీజీపీ దృష్టి ..

ఆలేరు మండలంలో గత కొద్దిరోజులుగా విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా మాఫియా గురించి ఏకంగా రాష్ట్ర డీజీపీ దృష్టికి పోయినట్టు సమాచారం. దీంతో ఆలేరు మండలం లో ఎంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతుందో అర్థమవుతుంది. అయినప్పటికీ మండలంలో ఇసుక మాఫియా ఇప్పటి కి రెచ్చిపోవడం గమనార్హం.

గ్రామంలో అలుముకున్న విషాదం..

అమాయక చిన్నారి మృతి ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం గ్రామానికే తీరని విషాదాన్ని మిగిల్చింది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. అక్రమ ఇసుక దందా పై కఠిన చర్యలు తీసుకోకపోతే మరెన్ని అమాయక ప్రాణాలు బలికావాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇసుక ట్రాలీ ప్రమాదంలో చిన్నారి మరణించిన ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు.

Next Story