వెనెజువెలాలో పెను విషాదం.. 4 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య.. వేలాది మంది గల్లంతు!

by Ramesh Naini |

వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి.

వెనెజువెలాలో పెను విషాదం.. 4 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య.. వేలాది మంది గల్లంతు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. జూన్‌ 24న కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన ఈ భారీ భూకంపాల వల్ల ఇప్పటివరకు 4,118 మంది ప్రాణాలు కోల్పోగా, 16,740 మంది గాయపడ్డారు. లా గ్వైరా తీరప్రాంతంలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఇంకా వేలాది మంది జాడ తెలియరాలేదు. ప్రాణాలతో ఉన్నవారి కోసం అధికారిక గాలింపు చర్యలు నిలిపివేసినప్పటికీ, కడసారి చూపు కోసమైనా స్థానికులు తమ వారి మృతదేహాల కోసం శిథిలాల వద్ద వెతుకుతూనే ఉన్నారు.

మరోవైపు వరుస ప్రకంపనలు..

మరోవైపు వరుస ప్రకంపనలు (ఆఫ్టర్ షాక్స్) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాజధాని కారకాస్‌లో 3.0 తీవ్రతతో భూకంపం రావడంతో భవనాలు ఖాళీ చేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నిధుల కోసం విజ్ఞప్తి

ఈ విపత్తు వల్ల దాదాపు 37 బిలియన్ డాలర్ల మేర మౌలిక సదుపాయాల నష్టం వాటిల్లినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 13 లక్షల మంది బాధితులకు తక్షణ సాయం అందించేందుకు 300 మిలియన్ డాలర్ల నిధులు కావాలని యూఎన్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనెజువెలాకు పునరావాస చర్యలు పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో.. యూకే ఆంక్షల కారణంగా బ్రిటన్‌లో స్తంభింపజేసిన దాదాపు 30 టన్నుల తమ దేశపు బంగారాన్ని సహాయక చర్యల నిమిత్తం తక్షణమే విడుదల చేయాలని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III ని కోరారు.

Next Story