గంజాయి విక్రయదారుల అరెస్ట్

by Taduka Kalyani |

గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు దాడి చేసి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

గంజాయి విక్రయదారుల అరెస్ట్
X

దిశ, జగదేవపూర్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు దాడి చేసి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... జగదేవపూర్ గ్రామానికి చెందిన చింతకింది అజయ్ కుమార్ (20), పీర్లపల్లి గ్రామానికి చెందిన బర్రెంకల శశిధర్ (25) ఇద్దరు కలిసి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి వద్ద రూ.10వేలతో 100 చిన్న గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేశారు. వాటిలో కొంత గంజాయిని తామే వినియోగించుకుంటూ మిగిలిన ప్యాకెట్లను జగదేవపూర్, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. ఈ క్రమంలో శనివారం జగదేవపూర్ సబ్ స్టేషన్ సమీపంలో గజ్వేల్ కు చెందిన చక్రికి 10 గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. పోలీసులను గమనించిన గజ్వేల్ కు చెందిన చక్రి తన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ అక్కడే వదిలి పరారయ్యాడు. అజయ్ కుమార్, శశిధర్ లను అదుపులోకి తీసుకొని గంజాయి, రెండు సెల్ ఫోన్లు, టీఏస్ 36 యం 1365 హోండా యాక్టివా, టీఏస్ 23 ఈ 1147 గల రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కుక్కునూరుపల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన రాజు, చక్రి ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి విక్రయదారులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ లింగం, బాలకిషన్ లను గజ్వేల్ ఏసిపి నర్సింలు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story