ముంబైలో క్రిస్టఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సందడి.. హాలీవుడ్ నటులతో ప్రత్యేక సమావేశం

by Ramesh Naini |

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న హాలీవుడ్ చిత్రం ‘ది ఒడిస్సీ’ జూలై 17న విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం భారతదేశంలో సందడి చేస్తోంది.

ముంబైలో క్రిస్టఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సందడి.. హాలీవుడ్ నటులతో ప్రత్యేక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న హాలీవుడ్ చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) జూలై 17న విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం భారతదేశంలో సందడి చేస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, నటులు మాట్ డామన్, టామ్ హాలెండ్, నిర్మాత ఎమ్మా థామస్‌లు ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక స్క్రీనింగ్, అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముంబై నగరాన్ని తన ప్రమోషన్ల టూర్‌లో భాగం చేయడంపై క్రిస్టఫర్ నోలన్ స్పందిస్తూ, సినిమాలను అమితంగా ప్రేమించే ముంబై ప్రేక్షకులకు తన చిత్రాన్ని ముందే పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 2017లో ‘డంకిర్క్’ సినిమా సమయంలో తొలిసారి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ముంబైతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఆ తర్వాత ‘టెనెట్’ సినిమాలోని కొన్ని కీలక భాగాలను కూడా ఇక్కడే చిత్రీకరించామని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆ దర్శకుడితో పనిచేయాలనేది 20 ఏళ్ల కోరిక

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర (ఒడిస్సస్) పోషించిన మాట్ డామన్ సినిమా నిర్మాణంలో నోలన్ విజన్‌ను కొనియాడారు. ‘ట్రాయ్ నగరం దహనమయ్యే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నప్పుడు అది కేవలం ఒక ‘ఫ్లాష్‌బ్యాక్’ సన్నివేశం మాత్రమే అని తెలిసి నోలన్ ఆలోచనా పరిధి ఎంత పెద్దదో అర్థమైంది’ అని డామన్ పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో భారతీయ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌తో కలిసి పనిచేయాలనేది తన 20 ఏళ్ల కోరికని ఆయన వెల్లడించారు. మరో నటుడు టామ్ హాలెండ్ మొరాకో ఎడారిలో జరిగిన షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, సినిమా సెట్‌లోకి అడుగుపెడితే కాలంలో వెనక్కి వెళ్లిన అనుభూతి కలిగిందని అన్నారు.

జూలై 17న భారతీయ థియేటర్లలో విడుదల

మహాకావ్యం ‘ది ఒడిస్సీ’ కథను సినిమాగా మలచడంపై నోలన్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల అంచనాల ఒత్తిడి తీసుకోకుండా, ఒరిజినల్ కథకు పూర్తి గౌరవం ఇస్తూ తనదైన శైలిలో ఉత్తమ చిత్రంగా దీనిని తెరకెక్కించినట్లు చెప్పారు. గ్రీస్, మొరాకో, ఐస్‌లాండ్, ఇటలీ వంటి పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ విజువల్ వండర్ జూలై 17న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.

Next Story