- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లె ప్రగతి బాట.. పేదలకు అండ!
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకూ పారదర్శకంగా అందిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, ఖమ్మం రూరల్: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకూ పారదర్శకంగా అందిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. సుమారు రూ. 4.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ సాయాన్ని అందజేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడు గ్రామంలో రూ. 2.24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆరేకోడు తండా నుంచి కాచిరాజుగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరేకోడు తండా గ్రామంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో గ్రామీణుల తాగునీటి అవసరాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఇదే వేదికపై గ్రామానికి చెందిన 20 మంది నిరుపేద నివాస రహితులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని భరోసా ఇచ్చారు.
తిరుమలాయపాలెం మండలం రమణ తండా గ్రామంలో రమణ తండా నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ములకలపల్లి - తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు రూ. 1.94 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న లింక్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని పేర్కొంటూ, మండల పరిధిలోని 19 మంది లబ్ధిదారులకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అదేవిధంగా అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 77 మంది లబ్ధిదారులకు రూ. 24.67 లక్షల మొత్తం విలువ కలిగిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఈ సందర్భంగా మంత్రి పంపిణీ చేశారు.
కొక్కిరేణి గ్రామంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రతి పనిలోనూ నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిధుల కొరత లేకుండా చూస్తామని, కాంట్రాక్టర్లు నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.






