తప్పుల్లేకుండా ఉద్యమకారుల గుర్తింపు.. త్వరలో సీఎం రేవంత్‌కు తుది నివేదిక: కమిటీ చైర్మన్ కేకే

by Ramesh Naini |

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేందుకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) పూర్తి స్థాయి సహకారం అందించనున్నట్లు ప్రకటించింది.

తప్పుల్లేకుండా ఉద్యమకారుల గుర్తింపు.. త్వరలో సీఎం రేవంత్‌కు తుది నివేదిక: కమిటీ చైర్మన్ కేకే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేందుకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) పూర్తి స్థాయి సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. ఉద్యమకాలంలో తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ జేఏసీలు, ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం వెల్లడించారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం)లో జరిగిన ఈ ముఖాముఖి సమావేశంలో ఉద్యమ కాలం నాటి ఉమ్మడి స్టీరింగ్ కమిటీ డైరెక్టరీ ఆధారంగా వివిధ ఉద్యోగ, ఉద్యమ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలను కమిటీకి రాతపూర్వకంగా సమర్పించారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు సంపూర్ణ మద్దతు అందిస్తామని వారు స్పష్టం చేశారు.

టీజేఏసీ స్టీరింగ్ కమిటీ వ్యక్తం చేసిన ఏకగ్రీవ మద్దతు

టీజేఏసీ స్టీరింగ్ కమిటీ వ్యక్తం చేసిన ఏకగ్రీవ మద్దతును కమిటీ చైర్మన్ కే. కేశవరావు, సభ్యులు స్వాగతించారు. రాజకీయాలకు అతీతంగా లభిస్తున్న ఈ సహకారంతో గ్రామీణ స్థాయి వరకు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా గుర్తించడం సాధ్యమవుతుందని కమిటీ పేర్కొంది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ నిర్వహిస్తున్న డిజిటల్ స్క్రీనింగ్ ఆధారంగా పారదర్శకమైన తుది నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పిస్తామని కేశవరావు తెలిపారు. సమావేశానికి టీజేఏసీ తరఫున ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవో నాయకులు కె. స్వామిగౌడ్, జి. దేవీప్రసాద్, కారం రవీందర్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నుంచి దొంతు ఆనందం, రాజిరెడ్డి, ఎలక్ట్రిసిటీ జేఏసీ నుంచి కె. రఘు, అడ్వకేట్ జేఏసీ నుంచి ఎం. రాజేందర్ రెడ్డి, ఎన్. ప్రహ్లాద్, డాక్టర్స్ జేఏసీ నుంచి డా. సురేష్ చంద్ర, ఇంజినీర్స్ జేఏసీ నుంచి శ్రీధర్ దేశ్‌పాండే, టి. వెంకటేశం, ఎం. బాలనర్సయ్యతో పాటు టీఎమ్మాఆర్పీఎస్, తెలంగాణ వికాస సమితి, ఉపాధ్యాయ సంఘాలు, ఎంపీజే, ప్రైవేట్ స్కూల్స్ జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యమకాలంలో టీజేఏసీలో భాగస్వాములైన టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాల స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సంక్షేమంపై టీజేఏసీ కీలక ప్రతిపాదనలు

ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న వారికి అధికారిక ప్రభుత్వ ప్రశంసా పత్రాలు అందించాలని టీజేఏసీ సూచించింది. ఇళ్లులేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల నివాస స్థలం కేటాయించాలని, వృద్ధాప్య ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, ఉచిత కార్పొరేట్ వైద్య సేవల కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఈ సూచనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు.

Next Story