- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ సుందరీకరణే ముఖ్యమా.. విద్యార్థుల చదువులు కాదా?
రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే ప్రభుత్వానికి మూసీ సుందరీకరణే ముఖ్యమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

- ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
- గవర్నర్‌కు బీసీ జేఏసీ వినతి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే ప్రభుత్వానికి మూసీ సుందరీకరణే ముఖ్యమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ ప్రతినిధుల బృందం శనివారం కలిసింది. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేసింది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో విద్యార్థుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా రూ.7,000 కోట్ల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేద విద్యార్థుల ఫీజులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ మొదటి దశ కోసం రూ.7,345 కోట్లు ఎలా విడుదల చేసిందని ప్రశ్నించారు. ఫీజులు రాక కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపేస్తుండటంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వేలాది మంది చదువు మధ్యలోనే ఆపేసి కులవృత్తుల్లో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాన్ని, నేటి కాంగ్రెస్ సర్కారు సమాధి చేయాలని చూస్తోందన్నారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసేలా, బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. తాము తెలిపిన వివరాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, విద్యార్థుల పట్ల ఇంత వివక్షా అంటూ ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపై గవర్నర్ సెక్రెటరీ దాన కిషోర్‌ను వాకబు చేశారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, గొడుగు మహేష్ యాదవ్, బి.మనీ మంజరి, జాజుల లింగం గౌడ్, నరేష్ ప్రజాపతి, నందగోపాల్, మల్లికార్జున్ యాదవ్, తారకేశ్వరి, విజయ్ తదితరులు ఉన్నారు.






