- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్ జానకి గుండెపోటుతో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ వినీల ఆకాశంలో మధురగాయనిగా ఖ్యాతిగాంచిన ప్రముఖ గాయని ఎస్. జానకి (88) అనారోగ్యంతో కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు ఆమె మరణంపట్ల సంతాపం తెలిపారు.
50 వేలకు పైగా పాటలతో రికార్డు
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ లో అప్పటి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో పుట్టిన జానకి.. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో గాయనిగా ఎదిగారు. నాదస్వర విద్వాంసుడైన పైడిస్వామివద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 1957లో తమిళ చిత్రమైన విధియిన్ విలయాట్టు ద్వారా ఆమె ప్లే బ్యాక్ సింగర్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కు పైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు ఆలపించారు. తన కెరీర్ లో 50 వేలకు పైగా పాటలు పాడిన అరుదైన గాయనిగా ఆమె గుర్తింపు పొందారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల్లో దాదాపు అన్ని ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత ఆమె సొంతం. ఘంటసాల, ఎంఎస్ విశ్వనాథన్, కే.వీ. మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్ - కోటి, ఎంఎం కీరవాణి, ఏఆర్ రెహమాన్, బప్పీ లహరి ఇలా ఎంతోమందితో కలిసి పనిచేశారామె. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళగీతాలు దక్షిణ భారత సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచాయి. అలాగే పి.బి. శ్రీనివాస్, డా. రాజ్‌కుమార్, కె.జే. యేసుదాస్ తదితర ప్రముఖులతో కూడా ఎన్నో హిట్ పాటలు పాడారు. అయితే, "ఎస్. జానకి" అనే ప్రత్యేక గుర్తింపును, మెలోడీ క్వీన్‌గా పేరు తెచ్చిన పాట బావా మరదళ్లు సినిమాలోని నీలి మేఘాలలో పాట. ఆ పాటతో ఆమె గాత్ర మాధుర్యం, భావ వ్యక్తీకరణకు విశేష ప్రశంసలు లభించాయి. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి ఎన్నో సినిమాల్లో మెప్పించారు. నాటి తరం నుంచి నేటి తరం వరకూ జానకి మధురగాత్రానికి మంత్రముగ్ధులయ్యే అభిమానులెందరో ఉన్నారు.
ఇప్పటికీ మరువలేని పాటలు
పదహారేళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వా పాట.. ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ సాంగ్ అంటే అతిశయోక్తి కాదు. పూజా ఫలంలో పగలే వెన్నెల జగమే ఊయల, సిరిసిరి మువ్వలో ఝుమ్మంది నాదం, సాగర సంగమంలో మౌనమేలనోయి పాటలతో పాటు.. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, జాబిల్లి కోసం ఆకాశమల్లే, మనసా తుళ్లిపడకే అతిగా ఆశపడకే, వెన్నెల్లో గోదారి అందం, కన్నె పిల్లవాణి, గున్నమామిజి, నరుడా ఓ నరుడా, కదిలే కాలమే జీవితం మేఘం తెల్లకాగితం వంటి ఎన్నో సుమధుర గీతాలకు ఆమె గాత్రాన్ని అందించారు.
10 నంది అవార్డులు.. ఎన్నో పురస్కారాలు
1986లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను కలైమామణి బిరుదుతో సత్కరించగా.. కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తి ని అందించింది. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. 4 జాతీయ అవార్డులు సహా.. ఆమె కెరీర్లో మొత్తం 32 అవార్డులు అందుకున్నారు. వీటిలో కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు సర్కారు నుంచి 6 అవార్డులు, ఒడిశా నుంచి ఒక అవార్డు అందుకున్నారు.10 నంది అవార్డులు కూడా అందుకున్నారు. కేంద్రప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ ఇవ్వగా.. దానిని ఆమెను తిరస్కరించారు. 1997లో ఫిలింఫేర్, 2002లో ఎచీవర్ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం, 2011లో కర్ణాటక బసవ భూషణ్ అవార్డు, 2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిత్ జీవిత సాఫల్య అవార్డు, 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, 2017లో సేఫ్ - వేటూరి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.






