కేసీఆర్ ఏం చేశారనే ప్రశ్నకు ఆర్‌బీఐ లెక్కలే సమాధానం: హరీశ్ రావు

by Ajay Maddhiboyina |

'గత కొన్నేళ్లుగా విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ అసలు ఏం చేశారు? అని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్‌బుక్ డేటా రూపంలో స్పష్టమైన సమాధానం లభించింది' అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

కేసీఆర్ ఏం చేశారనే ప్రశ్నకు ఆర్‌బీఐ లెక్కలే సమాధానం: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : 'గత కొన్నేళ్లుగా విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ అసలు ఏం చేశారు? అని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్‌బుక్ డేటా రూపంలో స్పష్టమైన సమాధానం లభించింది' అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్ రావు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. బిజినెస్ స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ స్టేట్స్ నివేదిక ప్రకారం.. 2016-17 నుంచి 2024-25 మధ్య కాలంలో తెలంగాణ 6.9 శాతం సగటు వార్షిక వృద్ధితో దేశంలోనే అత్యధిక వ్యవసాయ జీవీఏ వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ జాబితాలో తెలంగాణ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మణిపూర్, అస్సాం నిలిచాయన్నారు.

అభివృద్ధి రాత్రికి రాత్రే రాలేదు..

ఇది రాజకీయ ప్రకటన కాదని, తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పును నిరూపించే ఒక స్వతంత్ర సంస్థ అంచనా అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి రాత్రికి రాత్రే రాలేదని, కేసీఆర్ విజన్, కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు అందించడం, రైతులకు ఉచిత నాణ్యమైన విద్యుత్, సకాలంలో విత్తనాలు-ఎరువుల లభ్యత, సమర్థవంతమైన ధాన్యం కొనుగోలు వ్యవస్థల వల్లే తెలంగాణ దేశంలోనే అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా మారిందన్నారు. కేసీఆర్ ఏం చేశారు? అని అడిగే వారికి ఈ నివేదికే సమాధానమని, రాజకీయ ప్రచారాలు, ప్రసంగాల కంటే ఈ గణాంకాలే వాస్తవాలను గట్టిగా చెబుతున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో అతలాకుతలం..

ఈ ఎంతో కష్టపడి సాధించిన ప్రగతి ఇప్పుడు తీవ్ర సవాల్‌ను ఎదుర్కొంటోందని హరీశ్ రావు పేర్కొన్నారు. కేవలం రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే వ్యవసాయ రంగం అనిశ్చితిలోకి వెళ్లిందన్నారు. నీటి కొరత, విద్యుత్ అంతరాయాలు, యూరియా కొరత, అధ్వాన్నమైన కొనుగోలు వ్యవస్థల కారణంగా.. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యవసాయ వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపించారు. వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో ఏళ్ల ప్రణాళిక, శ్రమ పడితే, దానిని బలహీనపరచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం రెండున్నరేళ్లే పట్టిందని విమర్శించారు. ఇప్పుడు ప్రశ్నించాల్సింది కేసీఆర్ ఏం చేశారు? అని కాదని.. తెలంగాణ కష్టపడి సాధించిన వ్యవసాయ వృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేజార్చుకుంటోంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Next Story