తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసులు, హత్యలు ఆందోళనకరంగా మారాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X
  • సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసులు, హత్యలు ఆందోళనకరంగా మారాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పరిపాలనపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. షాబాద్ దైవాలగూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపిన ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, రంగారెడ్డి, వికారాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిందితుడిపై గతంలోనే కేసులు ఉన్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

షాబాద్ ఘటనలో మే 16న కేసు నమోదైతే, నిందితుడు జూన్ 12న బెయిల్ తీసుకొని జూన్ 16న పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని, జులై 10న ఆరుగురిని మర్డర్ చేశాడని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వివరించారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసుల్లో నిందితులకు బెయిలు రాకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే బెయిల్ పొందిన వారిపై పునఃసమీక్ష చేసి, రద్దు చేయాలని సూచించారు. పేట్ బషీరాబాద్ ఘటనలో బాధితురాలికి రక్షణ కల్పించాలని, ఫేక్ కేసులను తక్షణమే తొలగించాలని కోరారు. బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసులో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, వెంటనే నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు రాజకీయ నేతలను కాపాడేందుకు కాకుండా, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.

Next Story