‘​సమయాన్ని వృథా చేయొద్దు.. లక్ష్యాలపై దృష్టి పెట్టండి’.. విద్యార్థులకు కీలక సూచనలు

by Jakkula.Mamatha |

"మనిషి జీవన గమనాన్ని మార్చే మహత్తర శక్తి విద్యేనని, బాలికలు విద్యను ఆయుధంగా మలుచుకొని అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని" ప్రముఖ విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.మొహమ్మద్ ఆజమ్ అలీ పిలుపునిచ్చారు.

‘​సమయాన్ని వృథా చేయొద్దు.. లక్ష్యాలపై దృష్టి పెట్టండి’.. విద్యార్థులకు కీలక సూచనలు
X

దిశ, ​హుజూరాబాద్ రూరల్: "మనిషి జీవన గమనాన్ని మార్చే మహత్తర శక్తి విద్యేనని, బాలికలు విద్యను ఆయుధంగా మలుచుకొని అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని" ప్రముఖ విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.మొహమ్మద్ ఆజమ్ అలీ పిలుపునిచ్చారు. పట్టణంలోని కేసి క్యాంప్ లో గల మహాత్మ జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం "విద్య విజయానికి తాళంచెవి" అనే అంశంపై ప్రేరణాత్మక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన డా. ఆజమ్ అలీ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.

​ఈ సందర్భంగా డా. ఆజమ్ అలీ మాట్లాడుతూ.. విద్య ద్వారానే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తాయన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ​గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంటూ, ఆ సమయాన్ని పుస్తక పఠనం, నైపుణ్యాభివృద్ధి, భాషా ప్రావీణ్యం కోసం కేటాయించాలని సూచించారు. ​విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలను చదవడం ద్వారా స్ఫూర్తి పొందాలని కోరారు. ​ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల దృక్పథంతో నిరంతరం శ్రమిస్తే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని భరోసా ఇచ్చారు. ​"తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కలలను నిజం చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత. ఉన్నత ఆశయాలు, మంచి విలువలతో ముందుకు సాగి కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలి."అని డా. మొహమ్మద్ ఆజమ్ అలీ తెలిపారు.

విద్యార్థినులతో ముఖాముఖి..

​సదస్సు అనంతరం డా. ఆజమ్ అలీ విద్యార్థినులతో ప్రత్యక్షంగా సంభాషించారు. ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలు, పోటీ పరీక్షల ప్రాముఖ్యత మరియు లక్ష్య సాధనకు అవసరమైన ప్రణాళిక రచన వంటి పలు అంశాలపై విద్యార్థినులు అడిగిన సందేహాలకు ఆయన సరళంగా సమాధానాలిస్తూ విలువైన సూచనలు చేశారు.

​ఘనంగా సన్మానం..

​పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ.. డా. మొహమ్మద్ ఆజమ్ అలీ అందించిన స్ఫూర్తిదాయక సందేశాలు విద్యార్థినుల భవిష్యత్ లక్ష్య సాధనకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది కలిసి డా. ఆజమ్ అలీని శాలువాతో ఘనంగా సత్కరించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Next Story