- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈగల్ దెబ్బకు డ్రగ్ మాఫియా గజగజ.. ఏడాదిలో 7 టన్నుల గంజాయి సీజ్!
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల్ ఫోర్స్ అద్భుత ఫలితాలు సాధిస్తోందని ఆ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల్ ఫోర్స్ అద్భుత ఫలితాలు సాధిస్తోందని ఆ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యంగా పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో దేశవ్యాప్తంగా ఆపరేట్ చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ సిండికేట్ల ఆటకట్టిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈగల్ ఫోర్స్ సాధించిన విజయాలు, ఆపరేషన్ల వివరాలను డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. గడిచిన ఏడాది కాలంలోనే ఈగిల్ ఫోర్స్ ఏకంగా 7,000 కిలోల గంజాయిని పట్టుకుని స్మగ్లర్ల ఆర్థిక, ఆపరేషనల్ మూలాలపై భారీ దెబ్బ కొట్టిందని డైరెక్టర్ తెలిపారు. నిరంతర నిఘా, పక్కా ఆపరేషన్లతో తెలంగాణ మీదుగా సాగే గంజాయి రవాణా కారిడార్‌ను దాదాపుగా మూసివేశామని, దీంతో స్మగ్లర్లు పాత రూట్లను వదిలేసి కొత్త మార్గాలను వెతుక్కునే పరిస్థితికి వచ్చారని పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో ఆపరేషన్లు
స్మగ్లింగ్ ముఠాలకు రాష్ట్ర సరిహద్దులు లేకపోవడంతో, ఈగల్ ఫోర్స్ తన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలకూ విస్తరించిందని సందీప్ శాండిల్య తెలిపారు. తాజాగా ఈ నెలలో ఈగల్ ఫోర్స్ అందించిన పక్కా సమాచారంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రాయ్‌పూర్ బృందం ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో 385 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఒడిశాలోని జైపూర్ నుంచి కలకత్తా బాంబే హైవే మీదుగా మహారాష్ట్ర, రాజస్తాన్‌లకు వెళ్తున్న ఈ సరుకును వారం రోజుల పాటు ట్రాక్ చేసి పట్టుకున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో రాజస్తాన్‌లోని భిల్వారాకు చెందిన డ్రైవర్ మహాదేవ్ భీల్ 23 ను అరెస్టు చేశామన్నారు.
రాంచీతో కలిసి యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్లు
2025 నవంబర్‌లో ఎన్‌సీబీ రాంచీతో కలిసి 500 కిలోలు, 2026 జూన్‌లో ఒడిశాలోని కొరాపుట్ పోలీసులతో కలిసి ఏవోబీ ప్రాంతంలో మరో 500 కిలోల గంజాయిని సీజ్ చేయడంలో ఈగల్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఒక రాష్ట్ర స్థాయి ఏజెన్సీగా మొదలైన ఈ బృందం.. ఇప్పుడు ఎన్‌సీబీతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి జాతీయ స్థాయి యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్లలో భాగస్వామిగా మారిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులదే బాధ్యత
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు డైరెక్టర్ సందీప్ శాండిల్య ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో యువత, విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతూ.. నేరాల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు రక్కసి బారిన పడొద్దు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలి. మీ పరిసరాల్లో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు అనుమానం వస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ సమాచారం గోప్యంగా ఉంచుతాం. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సాధనలో మాకు సహకరించండి అని సందీప్ శాండిల్య కోరారు.






