రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

by Batti.Sumithra |

ఆదిలాబాద్‌లో ఉండే తమ చిన్నమ్మ శుక్రవారం మరణించడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శనివారం జన్నారానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మోటార్‌ సైకిల్‌ పై ఆదిలాబాద్‌కు బయలుదేరారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
X

దిశ, గుడిహత్నూర్ : ఆదిలాబాద్‌లో ఉండే తమ చిన్నమ్మ శుక్రవారం మరణించడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శనివారం జన్నారానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మోటార్‌ సైకిల్‌ పై ఆదిలాబాద్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా, అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని సీతాగొందీ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్ సబీర్, అతని తమ్ముడు ఎండి జంగీర్ తమ చిన్నమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శనివారం ఉదయం 8 గంటలకు జన్నారం నుంచి మోటార్‌సైకిల్‌పై ఆదిలాబాద్‌కు బయలుదేరారు.

మార్గమధ్యలో మండలంలోని సీతాగొందీ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో అన్నదమ్ములిద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో అన్న అబ్దుల్ సబీర్‌కు గాయాలు కాగా, తమ్ముడు జంగీర్ తొడపై నుంచి లారీ వెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరినీ హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ జంగీర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన అబ్దుల్ సబీర్ చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Next Story