భార్యపై కొడవలితో భర్త దాడి యత్నం.. అల్వాల్‌లో కలకలం!

by Jakkula.Mamatha |

కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన భార్య పై, ఒక భర్త కొడవలితో దాడికి యత్నించిన భయాందోళనకర ఘటన శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

భార్యపై కొడవలితో భర్త దాడి యత్నం.. అల్వాల్‌లో కలకలం!
X

దిశ, అల్వాల్: కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన భార్య పై, ఒక భర్త కొడవలితో దాడికి యత్నించిన భయాందోళనకర ఘటన శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్‌కు చెందిన చందు, సంజనలకు ఏడాది క్రితం వివాహమైంది. అయితే, గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి. భర్త చందు తరచూ వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేక సంజన ఇటీవల పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో సంజన సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్స్‌లో ఉన్న తన బాబాయ్ శ్రీనివాస్ ఇంట్లో జరుగుతున్న ఒక వర్ధంతి కార్యక్రమానికి హాజరైంది. ఈ విషయం తెలుసుకున్న చందు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ, ద్విచక్రవాహనంపై కొడవలితో అక్కడకు చేరుకున్నాడు. ఆవేశంగా ఇంట్లోకి దూసుకెళ్లి సంజనను హతమార్చేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చందును వెంటనే అడ్డుకుని బయటకు తోసివేశారు. అయినప్పటికీ, భార్యను చంపేస్తానంటూ చందు ఇంటి బయట కొడవలితో కేకలు వేస్తూ తీవ్రంగా హల్‌చల్ చేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు వెంటనే అల్వాల్ పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story