వియత్నాంలో విషాదం.. మచిలీపట్నం వాసి భార్య మృతి

by Naga Rani Yarlagadda |

వియత్నాంలో జరిగిన ఘోర పర్యాటక బోటు ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్లు సమాచారం అందింది.

వియత్నాంలో విషాదం.. మచిలీపట్నం వాసి భార్య మృతి
X
  • భర్త ఐసీయూలో ఉన్నట్టు సమాచారం
  • ఫు క్వాక్‌లో పర్యాటక స్పీడ్‌బోట్ బోల్తా.. విదేశీ పర్యటన విషాదాంతం

దిశ, వెబ్‌డెస్క్: వియత్నాంలో జరిగిన ఘోర పర్యాటక బోటు ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్లు సమాచారం అందింది. ఆయన సతీమణి గెల్లి జయశ్రీ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లావా సెల్ కంపెనీ తమ వ్యాపార భాగస్వాములు, డీలర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా గెల్లి దంపతులు దంపతులు వియత్నం వెళ్లినట్లు తెలిసింది. జూలై 11న వియత్నంలోని ఫు క్వాక్ ప్రాంతంలోని ఆన్ థోయ్ ద్వీపసమూహం సమీపంలోని హోన్ మే రుట్ వద్ద పర్యాటకులతో విహారయాత్రకు బయలుదేరిన స్పీడ్‌బోట్ ప్రమాదానికి గురైంది. సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో బలమైన గాలులు, ఎత్తైన కెరటాల ధాటికి బోటు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న పలువురు నీటిలో చిక్కుకోగా, సహాయక బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి.

వియత్నం ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన యాత్రికులు సహా మొత్తం 32 మంది మృతి చెందినట్లు వియత్నం ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ కూడా ఉన్నారు. ఆమె భర్త ఐసీ లో ఉన్నట్టు సమాచారం. జయశ్రీ మృతి చెందడంతో మచిలీపట్నం లోని ప్రజలు విషాదంలో మునిగిపోయారు. గెల్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే స్థానిక వ్యాపార వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. గెల్లి కిషోర్ ఐసీ లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందింది. అయితే వియత్నాంలో జరిగిన దుర్ఘటన విషయంలో పూర్తి సమాచారం రాకపోవడంతో నగరంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఐసీ లో ఉన్న గెల్లి కిషోర్ మచిలీపట్నంలో టాటా ఇండికాం టాటా సిల్యులర్ డీలర్ గా వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవసరమైన ప్రక్రియలను పూర్తి చేశారు. మృతదేహాలను ప్రత్యేక విమానం ద్వారా ఆయా రాష్ట్రాలకు తరలించి, అక్కడి నుంచి స్వగ్రామాలకు చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో గిల్లి కిషోర్ భార్య మృతదేహం మచిలీపట్నానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ విషాద ఘటనపై మచిలీపట్నంలోని ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గెల్లి జయశ్రీ మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

Next Story