మధ్యప్రదేశ్ లో కారుణ్య నియామకాల పేరుతో భారీ మోసం

by Shamantha N |

మధ్యప్రదేశ్‌ రేవా జిల్లాలోని విద్యాశాఖలో అవకతవకలు బయటపడ్డాయి. ఉద్యోగం కోసం నకిలీ పత్రాలను ఉపయోగించి కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు పొందిన మోసం వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ లో కారుణ్య నియామకాల పేరుతో భారీ మోసం
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌ రేవా జిల్లాలోని విద్యాశాఖలో అవకతవకలు బయటపడ్డాయి. ఉద్యోగం కోసం నకిలీ పత్రాలను ఉపయోగించి కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు పొందిన మోసం వెలుగులోకి వచ్చింది. అసలు ఉద్యోగం చేయని ఒక మహిళను మృతురాలిగా చూపి, ఆమె కొడుకుగా మారు పేరుతో ఒక వ్యక్తి ప్యూన్‌ ఉద్యోగం పొందాడు. రేవా జిల్లా త్యోంథర్ తహసీల్‌లోని పరాసియా గ్రామానికి చెందిన శివచరణ్ కోల్ కుమారుడు బ్రిజేష్ కోల్ అనే వ్యక్తి, బేలా కాలీ కోల్ అనే మహిళ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేసినట్లు చూపించి ఆమె మరణించిందని నకిలీ ధృవపత్రాలతో దరఖాస్తు చేశాడు. గంగేవ్ బ్లాక్‌లోని జౌదోరి ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో ప్యూన్ ఉద్యోగం పొందాడు. కానీ అసలు విషయం బేలా కాలీ కోల్ ఎప్పుడూ టీచర్‌గానీ, విద్యాశాఖలోగానీ పనిచేయలేదు. ఆమెకు బ్రిజేష్‌కు ఎలాంటి సంబంధం లేదు.

గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్

పాఠశాల ప్రిన్సిపాల్‌ జీతాలు ఇచ్చే ప్రక్రియలో పత్రాలను పరిశీలించిన సమయంలో అనుమానాస్పద వివరాలు కనిపించి పై అధికారులకు సమాచారం అందించారు. విచారణలో ఈ మోసం బయటపడింది. వెంటనే బ్రిజేష్ కోల్ నియామకం రద్దు చేశారు. జిల్లా విద్యాధికారి సుదామ గుప్తా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, మరో ఐదుగురు వ్యక్తులు.. ఓం ప్రకాష్ కోల్, సుష్మా కోల్, వినయ్ రావత్, హిరామణి రావత్, రామ్ ద్వివిది నకిలీ పత్రాలతో ఉద్యోగాల్లో చేరినట్లు వెల్లడైంది. ఈ నియామకాలు రేవా జిల్లాలోని టిగ్రా, బిడా, అటారియా, సెమారియా, గంగేవ్ బ్లాక్‌లలో జరిగినట్లు తేలింది. కలెక్టర్ ప్రతిభా పాల్ మాట్లాడుతూ.. నియామక ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. మొత్తం ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. క్లర్క్‌ను సస్పెండ్ చేశాం. డీఈవో, నోడల్ అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలకు ప్రతిపాదనలు పంపాం అన్నారు. రేవా అదనపు ఎస్పీ ఆర్తి సింగ్ ప్రకారం.. డిసెంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్యలో ఈ మోసాలు జరిగాయని, అన్ని పత్రాలు పూర్తిగా నకిలీ అని స్పష్టమైంది. మోసం, ఫోర్జరీ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా జరిగిన కారుణ్య నియామకాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story