ముంబైలో 1000 కోట్ల ఆస్తిని రూ. 1కే స్మారక చిహ్నంగా.. అయినా కోర్టు ఏం చెప్పిందంటే

by Shamantha N |

ముంబయిలోని శివాజీ పార్క్‌ ప్రాంతంలోని ముంబయి మేయర్ బంగ్లాను బాల్ థాకరే స్మారక చిహ్నంగా కేటాయించడంపై దాఖలైన పిఐఎల్‌లను (ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను) బాంబే హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

ముంబైలో 1000 కోట్ల ఆస్తిని రూ. 1కే స్మారక చిహ్నంగా.. అయినా కోర్టు ఏం చెప్పిందంటే
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబయిలోని శివాజీ పార్క్‌ ప్రాంతంలోని ముంబయి మేయర్ బంగ్లాను బాల్ ఠాక్రే స్మారక చిహ్నంగా కేటాయించడంపై దాఖలైన పిఐఎల్‌లను (ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను) బాంబే హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ బంగ్లాను రూ.1 కే లీజుకు కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 2017-2019 మధ్య నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి సందీప్ మార్నే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర తరపున న్యాయవాది జ్యోతి చవాన్ వాదనలు వినిపిస్తూ 2017 లో నోటీసులు జారీ చేసిన సమయంలో సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించామని కోర్టుకు వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వం కేటాయింపులో అవసరమైన విధి విధానాలు పాటించిందని తెలిపారు.

వ్యతిరేకం కాదు.. కానీ నామమాత్రపు ధరపై అభ్యంతరం

పిటిషనర్లు స్మారక చిహ్నానికి వ్యతిరేకం కాదని, కానీ విలువైన ప్రభుత్వ ఆస్తిని నామమాత్రపు ధరకు అప్పగించడాన్ని తప్పుపట్టారు. ‘రూ.1,000 కోట్ల విలువైన భూమిని రూ.1కి అప్పగించడం ప్రజా ఆస్తి దుర్వినియోగం’ అని న్యాయవాది ఉదయ్ వరుంజికర్ వాదించారు. ట్రస్ట్ తరఫున న్యాయవాది డారియస్ ఖంబాటా, ఇలాంటి రాయితీలు ఇతర ట్రస్ట్‌లకూ లభించాయని వివరించారు. స్మారక చిహ్నం పూర్తైందని, వారసత్వ భవనం యధాతథంగా ఉంచి పునరుద్ధరించారని, పైగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఆర్కిటెక్ట్ అభా లాంబా పర్యవేక్షించారని కోర్టుకు తెలిపారు. 2026లో బాల్ థాకరే శతజయంతి సందర్భంగా ఈ స్మారక చిహ్నాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.

Next Story