ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక విరామం

by Shamantha N |   (  Updated:2025-06-29 06:22:14  IST  )

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక విరామం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నట్లు గఢ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే నేషనల్ మీడియాకు వెల్లడించారు. ‘హరిద్వార్, రుషికేష్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్‌నగర్ ప్రాంతాల్లో యాత్రికులను నిలిపివేయాలని పోలీస్‌, పరిపాలన అధికారులకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు

ఉత్తర కాశీ జిల్లాలో బర్కోట్-యమునోత్రీ రోడ్డుపై ఉన్న సిలాయి బండ్ వద్ద కొండ చరియలు విరిగి పడిన ఘటనలో నిర్మాణంలో ఉన్న హోటల్ ప్రాంగణంలో పనిచేస్తున్న 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఉత్తర కాశీ కలెక్టర్ ప్రశాంత్ ఆర్య ఈ విషయాన్ని నిర్ధారించారు. యమునోత్రీ మార్గం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ ఈ ఘటనపై స్పందిస్తూ యాత్రికులు స్థానికుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చమోలీ జిల్లా పోలీసులు (ఎక్స్) పోస్ట్‌లో .. నందప్రయాగ్ భానర్పానీ సమీపంలో బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేశామని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని 24 గంటల పాటు కొండ ప్రాంతాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అవసరం లేకుండా ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story