- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గాడ్జిల్లా గర్ల్’ కేలీ హాటిల్ కన్నుమూత.. 18 ఏళ్లకే ముగిసిన ప్రయాణం
హాలీవుడ్ ప్రముఖ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హాలీవుడ్ ప్రముఖ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కేలీ హాటిల్ (18) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మంగళవారం వేకువజామున జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. కారు అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న 19 ఏళ్ల యువకుడు గాయాలతో ఆస్పత్రిలో చేరగా, కారులో ఉన్న మరో ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. కేలీ మరణవార్తను ఆమె తండ్రి జాషువా హాటిల్ ఫేస్‌బుక్‌లో అమెరికన్ సైన్ లాంగ్వేజ్ (ASL) ద్వారా ధృవీకరించారు.
స్ఫూర్తిదాయక ప్రయాణం..
జార్జియాలో జన్మించిన కేలీ పుట్టుకతోనే బధిరురాలు (చెవిటి). ఆమె తండ్రి వైపు నాలుగు తరాలుగా ఈ సమస్య ఉన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. తన లోపాన్ని జయించి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె, 2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’, 2024 లో వచ్చిన ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రాల్లో ‘జియా’ అనే అనాథ పాత్రలో నటించి మెప్పించింది. సినిమాలో కాంగ్‌తో సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆమె పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాత్రకు గానూ ఆమె ఉత్తమ యువ నటిగా ‘సాటర్న్ అవార్డు’కు కూడా నామినేట్ అయింది. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన కేలీ హఠాన్మరణం సినీ అభిమానులకు తీరని లోటు. ఆమె మృతి పట్ల ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో పాటు, ఆమె విద్యాభ్యాసం చేసిన టెక్సాస్ స్కూల్ ఫర్ ది డెఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.






