Health : జీవక్రియపై ‘లేట్ నైట్ డిన్నర్’ ప్రభావం.. ఊబకాయానికి దారితీస్తుందా?

by Javid Pasha |

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే శరీరం కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయదు. ఇది అధిక బరువు లేదా ఊబకాయానికి దారితీయవచ్చు

Health : జీవక్రియపై ‘లేట్ నైట్ డిన్నర్’ ప్రభావం.. ఊబకాయానికి దారితీస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే మీరు అధిక బరువు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. సెల్ మెటబాలిజం (Cell Metabolism)జర్నల్ సహా పలు ఇతర అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత డిన్నర్ చేసే అలవాటు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యకు దారితీస్తుందని పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఇది నిద్ర చక్రాన్ని ఆటంకపరుస్తుంది. నిద్ర ఆటంకాలు జీవక్రియను నెమ్మదిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫలితంగా బరువు పెరగడం సులభం ప్రారంభం అవుతుంది.

జీవక్రియపై ప్రభావం

లేట్‌నైట్ డిన్నర్ అనేది జీవక్రియ (Metabolism)ను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. నిజానికి మన శరీరం రోజువారీ సర్కాడియన్ రిథమ్ (24 గంటల బయోలాజికల్ క్లాక్) ప్రకారం పని చేస్తుంది. పగటిపూట జీవక్రియ వేగంగా ఉంటుంది, రాత్రి సమయంలో నెమ్మదిస్తుంది. కాబట్టి రాత్రి ఆలస్యంగా (ముఖ్యంగా 10 గంటల తర్వాత) భోజనం చేస్తే శరీరం ఆ కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయలేకపోవడంవల్ల అధిక బరువు లేదా ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రధాన ప్రభావాలు

*ఇన్సులిన్ స్పందన తగ్గడం: రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ సరిగా పని చేయకపోవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, కొవ్వు నిల్వ అవకాశం ఎక్కువవుతుంది.

*నిద్రపై ప్రభావం: లేట్‌ నైట్ డిన్నర్ స్లీప్ క్వాలిటీని తగ్గిస్తుంది. నిద్ర లోపం వల్ల గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ పెరిగి, లెప్టిన్ (సంతృప్తి హార్మోన్) తగ్గుతుంది. ఫలితంగా మరుసటి రోజు ఎక్కువ తినే అవకాశం పెరుగుతుంది.

*జీర్ణక్రియలో నెమ్మది: రాత్రి సమయంలో జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. ఆలస్యంగా తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి.

*కొవ్వు నిల్వ పెరగడం: రాత్రి తీసుకున్న అదనపు కేలరీలను శరీరం ఎక్కువగా కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఇది అధిక బరువు లేదా ఊబకాయం సమస్యకు దారితీస్తుంది.

ఏం చేయాలి?

ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం రాత్రి 8-9 గంటలలోపు భోజనం పూర్తి చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డిన్నర్ తర్వాత కొద్దిసేపు నడక లేదా తేలికపాటి కదలిక ఉంటే బాగుంటుంది. అయితే భోజనం సమయం ఒక్కటే పూర్తిస్థాయి బరువు నియంత్రణకు కారణం కాదు. రోజంతా తీసుకునే ఆహార నాణ్యత, మొత్తం కేలరీలు, శారీరక వ్యాయామం, లైఫ్‌స్టైల్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story