ఫిఫా వరల్డ్ కప్ వేదికగా ప్రేమ బహిర్గతం.. కెనడా మాజీ ప్రధాని ట్రూడో-కేటీ పెర్రీ జంట హాట్ టాపిక్

by Ramesh Naini |   (  Updated:2026-06-14 11:53:22  IST  )

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రతిష్టాత్మక ‘ఫిఫా వరల్డ్ కప్-2026’లో ఆయన తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కలిసి పబ్లిక్‌గా సందడి చేశారు.

ఫిఫా వరల్డ్ కప్ వేదికగా ప్రేమ బహిర్గతం.. కెనడా మాజీ ప్రధాని ట్రూడో-కేటీ పెర్రీ జంట హాట్ టాపిక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రతిష్టాత్మక ‘ఫిఫా వరల్డ్ కప్-2026’లో ఆయన తన గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కలిసి పబ్లిక్‌గా సందడి చేశారు. అంతే కాకుండా, సొంత దేశం ఆడుతున్న మ్యాచ్‌కు వెళ్లకుండా అమెరికా మ్యాచ్‌ను వీక్షించడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

వైరల్ అవుతున్న ట్రూడో, కేటీ పెర్రీల వీడియోలు

కాలిఫోర్నియాలోని సోఫీ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల్లో కేటీ పెర్రీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సిల్వర్ గౌన్‌లో మెరిసిన ఆమె, 10 ఏళ్ల నార్వేజియన్ సింగర్ టియస్ లూకాతో కలిసి ‘వండర్’ పాటను ఆలపించారు. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె మైదానం నుంచి నేరుగా ట్రూడో వద్దకు రావడం, ఆయన ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత అమెరికా-పరాగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌ను వీరిద్దరూ చేతులు పట్టుకుని వీక్షించారు. ఇటీవల ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి కలిసి కనిపించిన ఈ జంట, ఇప్పుడు వరల్డ్ కప్ వేదికగా తమ ప్రేమను బహిర్గతం చేశారు.

వివరణ ఇచ్చిన మాజీ ప్రధాని

కెనడా జట్టు ఆడుతున్న మ్యాచ్‌ను కాదని, గర్ల్‌ఫ్రెండ్ కోసం అమెరికా మ్యాచ్‌కు హాజరుకావడంపై ట్రూడోను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. విమర్శల నేపథ్యంలో ట్రూడో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘కొన్నిసార్లు సపోర్టివ్ బాయ్‌ఫ్రెండ్ బాధ్యతలు పిలుస్తాయి.. కానీ నా మద్దతు ఎప్పటికీ కెనడాకే’ అంటూ ఆయన వివరణ ఇచ్చారు.

కెనడాకు తొలి పాయింట్..

ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. కాగా, బోస్నియాతో జరిగిన మ్యాచ్‌ను కెనడా 1-1తో డ్రాగా ముగించింది. తద్వారా ఈ వరల్డ్ కప్‌లో కెనడా తమ ఖాతాలో తొలి పాయింట్‌ను నమోదు చేసుకోగలిగింది.

ఖతర్ రికార్డ్ బ్రేక్.. ఫిఫా చరిత్రలో తొలి పాయింట్

Next Story