​ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం...

by Kodari Anjali |

హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా ముగిసింది.

​ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం...
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా ముగిసింది. స్థానిక సిటీ సెంట్రల్ హాల్‌లో హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ ఖిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-2026 విద్యాసంవత్సరానికి గాను వివిధ రాష్ట్రీయ, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు, సీట్లు సాధించిన హుజూరాబాద్ పట్టణ ప్రాంత విద్యార్థులకు (టౌన్స్ టాప్ అచీవర్స్) ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

​జోరుగా సాగిన సన్మానాల పర్వం..

​ఈ విద్యాసంవత్సరంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో సిటీ సెంట్రల్ హాల్ కిక్కిరిసిపోయింది. పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 164 మంది విద్యార్థులను, ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన 68 మంది విద్యార్థులను సొసైటీ ప్రతినిధులు వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన ఐఐటీ జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన ఒక విద్యార్థిని, దేశంలోని ప్రతిష్టాత్మక వైద్య, సాంకేతిక విద్యాసంస్థలైన ఎంబీబీఎస్, నిట్ లలో సీట్లు సాధించిన 8 మంది విద్యార్థులతో పాటు, జేఈఈ బి.టెక్ లో సీట్లు సాధించిన మరో ఇద్దరు విద్యార్థులను వేదికపై శాలువాలు కప్పి, మెమెంటోలు (జ్ఞాపికలు) అందజేసి ఘనంగా సత్కరించారు.

​ సమాజంతోనే దేశ ప్రగతి..

​ఈ సందర్భంగా మస్జిద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్, ఖిద్మత్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ గఫార్, ఫహీంలు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించడం హుజూరాబాద్‌కే గర్వకారణమన్నారు. ముస్లిం వెల్ఫేర్ ఖిద్మత్ సొసైటీ కేవలం సామాజిక సేవకే పరిమితం కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, సామాజిక స్పృహ కలిగి ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

​గురువుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది..

ఈ ​కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల నిరంతర శ్రమ దాగి ఉందన్నారు. జాతీయ స్థాయి సంస్థలైన ఐఐటీ, నిట్, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించడం సాధారణ విషయం కాదని, కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని ఈ విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ ప్రాంతం నుండి మరికొంత మంది సివిల్ సర్వెంట్లు, శాస్త్రవేత్తలు రావాలని ఆకాంక్షించారు. ఈ ఘన సన్మాన మహోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఖిద్మత్ సొసైటీ ముఖ్య సభ్యులు సయ్యద్ అబ్ధుల్ కరీం, సలీం, అహమద్, అజ్మతుల్లా ఖాన్, వివిధ పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయ బృందం, సొసైటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Next Story