సమాజం కోసం పనిచేసే వారే నిజమైన దేశభక్తులు : వీసీ సజ్జనార్

by Taduka Kalyani |

సమాజంలో సానుకూల మార్పు కోసం పనిచేసే వారే నిజమైన దేశభక్తులని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.

సమాజం కోసం పనిచేసే వారే నిజమైన దేశభక్తులు : వీసీ సజ్జనార్
X

దిశ, శంకర్‌పల్లి: సమాజంలో సానుకూల మార్పు కోసం పనిచేసే వారే నిజమైన దేశభక్తులని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొద్దుటూరులోని ఎక్స్‌పీరియో ఎకో ఫ్రెండ్లీ పార్క్‌లో గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మోకిలా ఎత్నిక్ రన్–2026 కార్యక్రమాన్ని సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభక్తి అనేది కేవలం మాటల్లో కాకుండా సమాజ హితానికి చేసే సేవలో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించడం, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం కూడా దేశభక్తిలో భాగమేనని స్పష్టం చేశారు. సమాజం మనకు ఏమిచ్చిందని ప్రశ్నించే బదులు, సమాజం కోసం మనం ఏమి చేశామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. యువత ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, పెద్ద పెద్ద మాటల కంటే చేతల్లో చూపే సేవే గొప్పదని అన్నారు. చిన్న చిన్న మార్పుల ద్వారానే సమాజంలో పెద్ద మార్పులు సాధ్యమవుతాయని, సామాజిక రుగ్మతల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయని, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. స్వచ్ఛ సేతు ఉద్యమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, తాము సృష్టించే వ్యర్థాల పట్ల బాధ్యత వహిస్తూ పర్యావరణ హిత కార్యక్రమాలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి శ్రీమతి వాణి తిమ్మయ్య మాట్లాడుతూ, ఎత్నిక్ రన్ కేవలం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజలు తమ మూలాలు, సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తు చేసుకునే ఉద్యమమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా ఉమ్మడి వేదిక అవసరమని, అందుకోసం ‘స్వచ్ఛ సేతు’ అనే జాతీయ వేదికను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌పీరియో ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎండీ రాందేవ్ రావు, వాటా ఫౌండేషన్ ప్రతినిధులు ఉదయ్ కుమార్, జేఏఎస్‌ఆర్ అన్నమయ్య, వైద్యురాలు డాక్టర్ శాంతి తుమ్మల తదితరులు పాల్గొన్నారు.

Next Story