- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెమలి నగర్‌లో రోడ్డు అధ్వానం
హై రైజ్ టవర్ల నిర్మాణాల కారణంగా నెమలి నగర్ ప్రధాన రహదారి దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, గండిపేట: మణికొండ డివిజన్ పరిధి నెమలి నగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా డీఎస్‌ఆర్, నవమి కంపెనీలు భారీ స్థాయిలో హై రైజ్ టవర్ల నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ భారీ వాహనాలు, ట్రక్కులు, నిర్మాణ సామగ్రి రవాణా వాహనాలు తిరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాల రాకపోకల కారణంగా ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని, పలుచోట్ల నాలుగు అడుగుల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో భారీగా నీళ్లు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెమలి నగర్ బస్తీ ప్రజలు నిత్య రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, సమీపంలోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌కు వచ్చే చిన్నారులు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటితో గుంతల లోతు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై పలుమార్లు డీఎస్‌ఆర్, నవమి సంస్థల ప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపించారు. కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపడుతున్న కంపెనీలు ప్రజల ప్రాథమిక సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంబంధిత మున్సిపల్, రెవెన్యూ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రోడ్డును మరమ్మతు చేయడంతో పాటు రహదారిని కనీసం నాలుగు అడుగుల ఎత్తుతో అభివృద్ధి చేసి వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. అధికారులు, కంపెనీ యాజమాన్యాలు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రానున్న పది రోజుల్లో బస్తీ ప్రజలంతా కలిసి నిర్మాణ పనులను స్తంభింపజేసేలా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






