మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం, స్టాంప్ పోర్జరీ...

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం, స్టాంప్ పోర్జరీ...
X

దిశ,మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అలాగే తహసీల్దార్ ఆఫీస్ అధికారిక ముద్ర నకిలీవి ముద్రలను తయారు చేసి నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో నలుగురు నిందితుల అరెస్టు చేసినట్లు మెట్‌పల్లి సీఐ సురేష్ బాబు తెలిపారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత నెలలో మెట్ పల్లి తహసీల్దార్ తన సంతకాన్ని ఫోర్జరీ, ఆఫీస్ ముద్రలను నకిలీవి తయారు చేసి వాటి సాయంతో నకిలీ పత్రాలను తయారు చేసి వాటిని అరపేట శివారులో గల సర్వే నెంబర్ 191 భూమిలో గల 8 గుంటల భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి తహసీల్దార్ నీత మెట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మెట్ పల్లి డీఎస్పీ పర్యవేక్షణలో మెట్ పల్లి సీఐ ఆధ్వర్యంలో ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బంది ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసులో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులను గుర్తించమన్నారు. వారిలో నలుగురు నిందితులు అయిన రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్ లను ఆదివారం అరెస్టు చేసి, నకిలీ పత్రాలకు తయారు చేయడానికి ఉపయోగించిన కంప్యూటర్ ఇతర పరికరాలు, రబ్బరు స్టాంపులను సీజ్ చేసి నిందితులను నలుగురిని కోర్టులో హాజరు పరచామని అన్నారు.

ధ్రువపత్రాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి..

ఈ కేసులో నిందితులు రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, బెజ్జారపు మధుసూదన్, పాకాల రాకేష్ మరియు అంగారి శంకర్, పరస్పరం కుమ్మక్కై నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆరపేట శివారులోని సర్వే నెం.191/ఈలో గల వివాదాస్పద భూమిని విక్రయించేందుకు నిందితులు కుట్ర పన్ని భూమికి ఆబాది సర్టిఫికేట్ జారీ చేయడానికి తహసీల్దార్ కార్యాలయం నిరాకరించినప్పటికీ, డాక్యుమెంట్ రైటర్ పాకాల రాకేష్ తన కంప్యూటర్‌లో నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి, తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేశాడు. అంగారి శంకర్ నకిలీ స్టాంపులు తయారు చేసి నేరానికి సహకరించాడు. నకిలీ ఆబాది సర్టిఫికేట్ ఆధారంగా మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బెజ్జారపు మధుసూదన్ పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, బెజ్జారపు మధుసూదన్ ఆర్థిక లాభం పొందినట్లు విచారణలో వెల్లడైంది. ప్రజలు భూముల కొనుగోలు సమయంలో సంబంధిత ప్రభుత్వ రికార్డులు, ధ్రువపత్రాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని మెట్‌పల్లి పోలీసులు సూచించారు. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేయడం, నకిలీ ధ్రువపత్రాలు తయారు చేయడం, వినియోగించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story