- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహిళలకు’ రక్షణేది?: పురుషుల ప్రవర్తనపై ప్రముఖుల ఆగ్రహం
నడిరోడ్డుపై వేధింపులు.. బస్సుల్లో అనుచిత ప్రవర్తన.. రద్దీ ప్రదేశాల్లో అసభ్యంగా చూడటం.. ఇవన్నీ మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు. ప్రజా ప్రదేశాలు అందరికీ సమానమే అయినప్పటికీ, అక్కడ మహిళలు అభద్రతకు లోనవ్వడానికి ప్రధాన కారణం పురుషుల ప్రవర్తనేనని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు...

దిశ,తెలంగాణ బ్యూరో: నడిరోడ్డుపై వేధింపులు.. బస్సుల్లో అనుచిత ప్రవర్తన.. రద్దీ ప్రదేశాల్లో అసభ్యంగా చూడటం.. ఇవన్నీ మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు. ప్రజా ప్రదేశాలు అందరికీ సమానమే అయినప్పటికీ, అక్కడ మహిళలు అభద్రతకు లోనవ్వడానికి ప్రధాన కారణం పురుషుల ప్రవర్తనేనని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వం కోసం నిర్వహిస్తున్న స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని వీహబ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నాలుగో విడత ప్యానెల్ చర్చ జరిగింది. ప్రజా స్థలాలు అందరివే.. పురుషుల ఉనికి, వారి ప్రవర్తన..అనే అంశంపై సాగిన ఈ చర్చా వేదికలో అధికారులు, కళాకారులు, పాత్రికేయులు తమ మనోగతాన్ని పంచుకున్నారు.
రక్షణ అంటే తుపాకీ ఉండటం కాదు...
చారు సిన్హా సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హా మాట్లాడుతూ.. భద్రత అనే అంశాన్ని కేవలం పోలీసు వ్యవస్థ కోణంలోనే చూడకూడదని పేర్కొన్నారు. ఒక మహిళ ప్రజా ప్రదేశంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న పురుషుల వల్ల భయం కలగకుండా ఉండటమే అసలైన భద్రత. మీ ఉనికి ఒక ఎంపిక. మీరు మీ ప్రవర్తన ద్వారా పక్కన ఉన్న మహిళకు సురక్షితమైన వాతావరణాన్ని అందించగలగాలి. ఇది కేవలం వ్యవస్థల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి తన బాధ్యతగా గుర్తించాలి అని ఆమె అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సమయంలో తనకు అండగా నిలిచిన పురుష సహోద్యోగుల వల్లే తాను ఆత్మవిశ్వాసంతో పనిచేయగలిగానని ఆమె గుర్తుచేసుకున్నారు.
భయపడకుండా తిరగగలిగినప్పుడే అభివృద్ధి ..
ప్రముఖ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన సమాజానికి మహిళల స్వేచ్ఛే కొలమానమన్నారు.మహిళలు ఏ సమయంలోనైనా, ఎక్కడికైనా భయపడకుండా వెళ్లగలిగే వాతావరణాన్ని మనం నిర్మించాలి. అది సాధ్యమైనప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. మహిళలు సురక్షితంగా ఉన్నారనే నమ్మకాన్ని కలిగించడం మనందరి సమిష్టి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మన ఇళ్ల నుంచే ఈ మార్పు మొదలవ్వాలని ఆయన సూచించారు.
పురుషులు మౌనం వీడాలి: ఉమా సుధీర్
చర్చను సమన్వయం చేసిన సీనియర్ జర్నలిస్టు ఉమా సుధీర్ మాట్లాడుతూ.. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనన్నారు.మహిళలపై వివక్ష చూపినా, వేధింపులకు గురిచేసినా పురుషులు మౌనంగా ఉండకూడదు. తోటి పురుషులు తప్పు చేస్తున్నప్పుడు వారిని ప్రశ్నించడం, బాధితురాలికి అండగా నిలబడటం నిజమైన పురుషత్వానికి నిదర్శనం అని ఆమె అన్నారు.
అండగా నిలిచేవాడే బలవంతుడు...
ది హిందూ బిజినెస్ లైన్ ఎడిటర్ రిచా మిశ్రా మాట్లాడుతూ.. మహిళలకు అండగా నిలిచే పురుషులు బలహీనులు కాదని, వారే మరింత శక్తివంతులని కొనియాడారు. కార్యాలయాల్లో, కుటుంబాల్లో సమానత్వం కోసం పురుషులు భాగస్వాములు కావాలన్నారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. మహిళలు తమ ఇబ్బందులను నిస్సంకోచంగా పంచుకునేలా పురుషులు నమ్మకాన్ని కలిగించాలని, వారి మాటలకు విలువనివ్వడం నేర్చుకోవాలని సూచించారు.
ఏడాది మొత్తం అవగాహన..
మహిళా-పురుషుల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించి, పరస్పర గౌరవం పెంచే లక్ష్యంతో స్టాండ్ విత్ హర్ ప్రచారం ప్రారంభమైంది. ప్రతి నెలా ఒక కీలకమైన సామాజిక అంశంపై మేధావులతో చర్చలు నిర్వహిస్తూ, సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ నెల నిర్వహించిన చర్చలో ఈవ్ టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, సైబర్ వేధింపుల వంటి అంశాలపై వక్తలు చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు.






