గాలివాన బీభత్సంలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించిన మంత్రి..

by Taduka Kalyani |   (  Updated:2026-06-14 12:41:33  IST  )

పట్టణంలోని దీపక్ నగర్ లోని పోచమ్మ గుడి వద్ద ఉన్న ఇంటి పై కప్పు తో లేచిపోవడంతో మంత్రి వివేక్, ఎంపీ వంశీ బాధిత కుటుంబానికి మనో ధైర్యం కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గాలివాన బీభత్సంలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించిన మంత్రి..
X

దిశ, మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ ఈదురు గాలుల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విరిగి పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి పోవడం, కాలనీ లోని పలు ఇళ్లు ధ్వంసం అవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్, ఎంపీ వంశీకృష్ణ తో కలిసి నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలోని దీపక్ నగర్ లోని పోచమ్మ గుడి వద్ద ఉన్న ఇంటి పై కప్పు తో లేచిపోవడంతో మంత్రి వివేక్, ఎంపీ వంశీ బాధిత కుటుంబానికి మనో ధైర్యం కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాలచెట్టు ఏరియా లో ఉన్న దుకాణాల పైన చెట్లు విరిగి పడిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. రెండవ జోన్ లోని సరస్వతి పాఠశాల పై చెట్లు పడటంతో దెబ్బతిన్న భవన భాగాలను సమీక్షించారు. పాఠశాల ఆవరణ ప్రాంతాల్లో ఉన్న నివాసాలు చాలా వరకు ఆస్తి నష్టం సంభవించింది. వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ చర్యలను వేగవంతం చేయాలని, విరిగిపడిన చెట్లను తొలగించి ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురు గాలి వర్షం వల్ల ఆర్థికంగా నష్టపోయిన బాధితులు మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story