బ్లూటూత్ దెబ్బకు.. యూటర్న్ తీసుకున్న విమానం

by Naga Rani Yarlagadda |

కేవలం ఒక బ్లూటూత్ కారణంగా.. 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో వెళ్తున్న విమానం యూటర్న్ తీసుకోవలసి వచ్చింది.

బ్లూటూత్ దెబ్బకు.. యూటర్న్ తీసుకున్న విమానం
X

దిశ, వెబ్‌డెస్క్: కేవలం ఒక బ్లూటూత్ కారణంగా.. 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో వెళ్తున్న విమానం యూటర్న్ తీసుకోవలసి వచ్చింది. ఫ్లైట్ యూటర్న్ కు, ఆ బ్లూటూత్ కు ఏంటి సంబంధమో తెలిస్తే షాకవ్వడం ఖాయం. ఈ వింత ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్ లోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పెయిన్ లోని పాల్మా డి మల్లోర్కాకు శనివారం సాయంత్రం యునైటెడ్ ఫ్లైట్ 236 (బోయింగ్ 767) విమానం బయల్దేరింది. ఈ విమానంలో 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 3 గంటల తర్వాత.. ప్రయాణికులంతా తమ బ్లూటూత్ డివైజ్ లను ఆఫ్ చేయాలని క్రూ సిబ్బంది కోరారు.

బ్లూటూత్ లను ఆఫ్ చేయాలని ఎన్నిసార్లు అనౌన్స్ చేసి.. అవైలబుల్ బ్లూటూత్ లిస్టులో Bombఅనే పేరు కనిపిస్తూనే ఉంది. దీంతో ఏదో జరగబోతోందని కంగారు పడిన విమాన సిబ్బంది, ఎయిర్ లైన్ యాజమాన్యం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా.. విమానాన్ని గాలిలోనుంచి వెనక్కి మళ్లించారు. రాత్రి 9.37 గంటల సమయంలో నెవార్క్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ను ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికుల్ని ఖాళీ చేయించి.. అథారిటీ పోలీసులు, టీఎస్ఏ, కస్టమ్స్ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా సెర్చ్ చేశారు. చివరికి ఆ బ్లూటూత్ డివైజ్ 16 ఏళ్ల కుర్రాడికి చెందిన ఫిట్ బిట్ అనే స్మార్ట్ వాచ్ అని గుర్తించారు. అతను సరదాగా ఆ డివైజ్ నేమ్ ను బాంబ్ అని మార్చుకోవడమే ఈ హైడ్రామాకు తెరతీసింది.

ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని వెనక్కి మళ్లించామని, అనంతరం కొత్త సిబ్బందితో ప్రయాణికులను స్పెయిన్ పంపించామని స్పష్టం చేసింది. స్థానిక పోలీసులు సదరు యువకుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయనప్పటికీ, దేశవ్యాప్త భద్రతకు సంబంధించిన విషయం కావడంతో అమెరికా నిఘా సంస్థ 'ఎఫ్‌బీఐ' (FBI) ఈ ఘటనపై అధికారికంగా విచారణ ప్రారంభించింది. కాగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో నెల రోజుల వ్యవవధిలో మూడు ఘటనలు జరగడం గమనార్హం. అంతకుముందు ఒక విమానంలో ప్రయాణికుడి గొడవ కారణంగా రూట్ మార్చాల్సి రాగా, నెవార్క్ ఎయిర్‌పోర్టులోనే మరో విమానం రన్‌వేపై ట్రక్కును, లైట్ పోల్‌ను ఢీకొట్టింది.

Next Story