షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది సజీవదహనం

by Naga Rani Yarlagadda |

ఓ షూ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 28 మంది కార్మికులు సజీవదహనమయ్యారు.

షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ షూ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 28 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ దుర్ఘటన తూర్పు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్సులోని జింజియాంగ్ నగరంలో ఉన్న హుయిటెంగ్ షూస్ ఫ్యాక్టరీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయి. కార్మికులు గమనించేలోగానే మంటలు వ్యాపించడంతో దాదాపు మూడు పదుల కార్మికులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. అనేకమంది కార్మికులు ఫ్యాక్టరీ లోపలే చిక్కుకున్నట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. 35 ఫైరింజన్లతో 183 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.. ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ విచారం వ్యక్తం చేశారు.

చైనా ప్రభుత్వ టెలివిజన్ విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. భవనం లోపలి నుంచి దట్టమైన నల్లటి పొగలు వెలువడుతుండగా.. అగ్నిమాపక సిబ్బంది వాటర్ హోస్ ల సహాయంతో మంటల్ని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీలు, భవనం పైకప్పు పైకి పరుగులు తీయడం ఆ వీడియోల్లో కనిపించింది. గతంలో హాంకాంగ్‌లోని కొన్ని బహుళ అంతస్తుల భవనాలలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 168 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత చైనా ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో ఎత్తైన భవనాలలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నెలలోనే గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక నివాస భవనంలో జరిగిన ప్రమాదంలో 12 మంది మరణించారు. ఈ లోపే తాజాగా మరో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం చైనాలో కలకలం రేపుతోంది.

Next Story