- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ED: కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు
కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KVSTDCL) నిధుల మళ్లింపుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బల్లారీ లోక్‌సభ ఎంపీ ఈ. తుకారాం (Ballari MP Thukaram), ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారికి సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. వాల్మీకీ కార్పొరేషన్ నిధులను లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జులై 2024లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ ఇంట్లో సైతం ఈడీ దాడులు జరిపింది. ఆయన (KVSTDCL) చైర్మన్‌గా ఉన్న సమయంలో నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలపై మనీలాండరింగ్ కేసులో ఈ విచారణ చేపట్టింది. అప్పట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 20 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఈ దర్యాప్తుల నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ ‘ఈడీకి దాడులు జరిపే హక్కు ఉంది. ఇది ప్రభుత్వానికి అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదు. కేంద్ర సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఈ కేసును విచారిస్తోంది’ అని తెలిపారు.
కుంభకోణం బయటకు ఎలా వచ్చిందంటే
2024 మే 21న ఈ కార్పొరేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ మృతదేహం బయటపడటంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆయన సూసైడ్ నోట్‌లో రూ.187 కోట్ల నిధులు అనధికారంగా మళ్లించబడ్డాయని పేర్కొన్నారు. అందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్ లోని ఓ సహకార బ్యాంక్‌లోకి అక్రమంగా జమ చేశారని ఆరోపించారు. ఈ ఘటన అనంతరం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ శాఖ, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఈడీ (ED) అతడిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ కుంభకోణంపై ఈడీ విచారణ మరింత వేగంగా సాగుతోంది. అధికార దుర్వినియోగం, ఎన్నికల నిధుల అక్రమ వినియోగంపై బలమైన ఆధారాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.






