Robert Vadra: మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు

by Shamantha N |   (  Updated:2025-06-10 09:45:33  IST  )

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను మరోసారి ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసింది.

Robert Vadra: మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను మరోసారి ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా, అక్రమాస్తుల కేసులో పరారీలో ఉన్న వ్యాపారవేత్త సంజయ్ భండారీతో వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సంజయ్ భండారీ 2016లో భారత్‌ నుంచి పారిపోయాడు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంటున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా ఎక్స్‌ట్రడిషన్ చర్యలు ప్రారంభించింది. విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉండటం, పీఎంఎల్ఏ (PMLA), బ్లాక్ మనీ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌లను ఉల్లంఘించడం వంటి తీవ్ర ఆరోపణలు భండారీపై ఉన్నాయి. భారత్‌లో ఆయుధ ఒప్పందాల నుంచి వచ్చిన అక్రమ డబ్బుతోనే భండారీ లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. రూ.300 కోట్లకు పైగా షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసి ఆస్తులుగా మలిచినట్లు అధికారులు పేర్కొన్నారు.

భండారీతో వాద్రాకు ఆర్థిక లావాదేవీలు..

ఈ వ్యవహారంలో రాబర్ట్ వాద్రా పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది. యూపీఏ హయాంలో భండారీతో ఆయనకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. 2023లో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో భండారీని వాద్రాకు సన్నిహితుడిగా పేర్కొంటూ ఆయన చెల్లింపుల వల్ల వాద్రాకు లాభం చేకూరిందని తెలిపింది.దీనిపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ తనకు భండారీతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనలేదు అని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు భండారీని భారత్‌కు అప్పగించేందుకు సంబంధించి వెస్ట్ మినిస్టర్ కోర్టు 2022లో అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ యూకే హోంశాఖ ఆమోదించిన ఆ ఉత్తర్వును భండారీ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ నేపథ్యంలో కేసు ఇంకా న్యాయపరిధిలో కొనసాగుతోంది. ఈడీ మరిన్ని ఆధారాలతో కేసులో పురోగతి సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది.

Next Story