అటవీ అధికారులపై దాడి అమానుషం

by Ratna Kumari |

వేములూరులో అటవీ అధికారులపై జరిగిన దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, మణుగూరు యూనిట్ అధ్యక్షుడు వి.గోవింద్ తీవ్రంగా ఖండించారు.

అటవీ అధికారులపై దాడి అమానుషం
X

దిశ, అశ్వాపురం : అశ్వాపురం మండల పరిధిలో పోడు భూముల వివాదాల నేపథ్యంలో మణుగూరు రేంజ్ పరిధిలోని మనుబోతులగూడెం బీట్‌లోని వేములూరులో అటవీ అధికారులపై జరిగిన దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, మణుగూరు యూనిట్ అధ్యక్షుడు వి.గోవింద్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనుబోతులపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుంపుగా వచ్చి ఫారెస్ట్ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు జేసీబీ పనులను అడ్డుకుని, అధికారులతో వాగ్వాదానికి దిగడం, భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత ఖండనీయమన్నారు.

అనంతరం ఫారెస్ట్ అధికారులపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేయడం, సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారుల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే తప్పుడు ప్రచారాలతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అడవులను పరిరక్షించడం తమ విధి అని, విధి నిర్వహణలో పలువురు అటవీ అధికారులు గాయపడుతున్నారని, కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మణుగూరు యూనిట్ వైస్ ప్రెసిడెంట్ పద్ధం ఎర్రయ, ట్రెజరర్ భీమ్‌చంద్, కార్యదర్శి జి.బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Next Story