కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్.. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం

by Ajay Maddhiboyina |

ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు.

కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్.. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ అందించి, వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్ వంటి వృత్తి నైపుణ్యాలు నేర్చుకుంటే భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవించవచ్చని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాల ద్వారా మహిళలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి వేళల్లో కూడా మహిళలు ధైర్యంగా బయటకు వెళ్లేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని విమర్శించారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ మహిళలు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలని.. స్వతంత్రంగా ఎదిగి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు డి. పద్మ, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్, నాయకులు అర్పిత ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story