ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ హైఅలర్ట్.. ఆ మూడు దేశాల ప్రయాణికులకు కేంద్రం అడ్వైజరీ

by Ramesh Naini |

ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ హైఅలర్ట్.. ఆ మూడు దేశాల ప్రయాణికులకు కేంద్రం అడ్వైజరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీహెచ్ఎస్ (DGHS) ప్రయాణికుల కోసం తాజాగా హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది.

ఆ మూడు దేశాలపై ఫోకస్.. 21 రోజుల నిబంధన

డబ్ల్యూహెచ్ఓ (WHO) నివేదికల ఆధారంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలను కేంద్రం హై-రిస్క్ దేశాలుగా గుర్తించింది. ఈ దేశాల నుంచి వచ్చే లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రయాణికుల్లో జ్వరం, వాంతులు, తీవ్రమైన నీరసం, విరేచనాలు, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పి లేదా వివరించలేని రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ డెస్క్‌కు తెలియజేయాలి. ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్న రోగి శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు కూడా అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. భారత్‌కు చేరుకున్న 21 రోజుల్లోగా పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే తమ ప్రయాణ వివరాలను వైద్యులకు తప్పనిసరిగా వెల్లడించాలి.

పెరుగుతున్న కేసులు..

కాంగోలో తాజాగా 513 అనుమానిత ఎబోలా కేసులు, 131 అనుమానిత మరణాలు నమోదైనట్లు సమాచారం. దీని తీవ్రత దృష్ట్యా జోర్డాన్ ఇప్పటికే కాంగో, ఉగాండా ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాశ్రయాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలకు అందరూ సహకరించాలని విమానాశ్రయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story